హిరణ్య కశిప .. ఇక అసాధ్యమేనా ?

కొన్ని పురాణాల కథలతో భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. వాటిలో ‘హిరణ్య కశిప’ ఒకటి. గుణ శేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఇదొకటి. ‘బాహుబలి2’ తర్వాత దగ్గుబాటి రానాతో గుణ శేఖర్ ఈ భారీ సినిమా చేయాలని భవించాడు. దాదాపు ఐదేళ్ల పాటు టీం తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్ అలాగే మరో హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయాలని డీల్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం 300 కోట్ల పైనే బడ్జెట్ అవుతుందని సురేష్ బాబు పలు సార్లు చెప్పుకున్నారు కూడా.

కట్ చేస్తే గుణ శేఖర్ సురేష్ బాబు మధ్య ఏదో తేడా వచ్చి ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళకుండా అటకెక్కింది. శాకుంతలం రిలీజ్ కి ముందు మీడియాతో ఆ ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని , హిరణ్య కశిప తన కథ అంటూ ఎవరితో చేస్తాననేది త్వరలో చెప్తానని గుణ శేఖర్ చెప్పుకున్నాడు. నిజానికి శాకుంతలం రిలీజ్ తర్వాత గుణ శేఖర్ తీయాల్సిన సినిమా ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శాకుంతలం గుణ శేఖర్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

దీంతో ఇక హిరణ్య కశిప ప్రాజెక్ట్ ఉండకపోవచ్చనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గుణ శేఖర్ ను నమ్మి ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామ్యం అయ్యేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రుద్రమదేవి తో నిర్మాతగా గుణ శేఖర్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు శాకుంతలం కి దిల్ రాజు చేయి కలిపారు కాబట్టి సినిమా బయటికి వచ్చింది. లేదంటే గుణ శేఖర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఓ పెద్ద యజ్ఞం చేయాల్సి వచ్చేది. మరి ఇప్పుడు తనను నమ్మి ముందుకు వచ్చిన దిల్ రాజు కి కూడా గుణ శేఖర్ షాకిచ్చాడు. దీంతో హిరణ్య ప్రాజెక్ట్ కి మరో నిర్మాత దొరకడం గగనమే అనిపిస్తుంది.