అక్కినేని అఖిల్‌కు హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ ముంగిట వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో డెబ్యూ హీరోకు సంబంధించి అనేక రికార్డులను నెలకొల్పాడు ఈ అక్కినేని కుర్రాడు. బడ్జెట్, ఓపెనింగ్స్ సహా అనేక విషయాల్లో నంబర్స్ చూసి ఔరా అనుకున్నారు. ఒక సూపర్ స్టార్ అవతరించబోతున్నాడనే అంచనాలు కలిగాయి. కానీ సినిమా చూశాక ఆ అంచనాలన్నీ తుస్సుమన్నాయి. ‘అఖిల్’ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను సైతం నిరాశ పరిచాయి. కానీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడి అతడికి ఉపశమనాన్ని అందించింది.
ఐతే ఎలాగైతేనేం ఒక సక్సెస్ ఫుల్ మూవీ పడటంతో నిర్మాత అనిల్ సుంకర అఖిల్‌తో పెద్ద సాహసానికి రెడీ అయిపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమాను అనౌన్స్ చేశాడు. దీని బడ్జెట్ రూ.50 కోట్లని సినిమా మొదలైన కొత్తలో వార్తలు వస్తే అందరూ అవాక్కయ్యారు.
అఖిల్‌కు తొలి సక్సెస్ అందించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అన్ని రకాలుగా కలిపి పాతిక కోట్లకు అటు ఇటుగా ఆదాయం తెస్తే.. తర్వాతి చిత్రానికి ఏకంగా డబుల్ బడ్జెట్ ఏంటి అనుకున్నారు. కానీ ఈసారి అఖిల్ చేస్తోంది మాస్ మూవీ, పైగా సురేందర్ రెడ్డి దర్శకుడు కాబట్టి ఎలాగోలా వర్కవుట్ చేస్తారులే అనుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాత అనిల్ బడ్జెట్ గురించి చెబుతున్న విషయాలు షాకిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని 80 కోట్ల బడ్జెట్లో తీసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఖర్చు అంతకంటే మించి కూడా అయ్యుండొచ్చని కూడా అన్నారు. కానీ అఖిల్‌ను నమ్మి మరీ అంత బడ్జెట్ పెట్టడమేంటి అన్నది జనాలకు అంతుబట్టడం లేదు. సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ మొత్తం రికవరీ అసాధ్యం అనే అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఆశించిన బజ్ కూడా లేదు. మరి ఇంత భారాన్ని అఖిల్ ఎలా మోస్తాడు.. సినిమాను ఎలా బయటపడేస్తాడు అన్నది చూడాలి.