వెంకీ మామని వాడుకోని భాయ్ జాన్

ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ మీద భీకరమైన బజ్ లేదు కానీ రిలీజయ్యాక ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందని సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఒకపక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్లో మొదలయ్యాయి కానీ స్టేటస్ చూస్తే స్లోగానే ఉన్నాయి. రంజాన్ పండగయ్యేవరకు ముస్లింలు సినిమాల జోలికి వెళ్లరు. ఎలాగూ ఈద్ అదే రోజు కాబట్టి సాయంత్రం నుంచి హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇదంతా హిందీ రాష్ట్రాలకు సంబంధించిన అప్ డేట్. ఇక మన సైడ్ ఎలా ఉందో చూద్దాం.

మార్కెటింగ్ సరిగా లేకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కిసీకా భాయ్ కిసీకా జాన్ వస్తున్న విషయం జనానికి రిజిస్టర్ కావడం లేదు. సీనియర్ మోస్ట్ స్టార్ హీరో వెంకటేష్ ఇందులో కీలక పాత్ర చేసినా దాన్ని పబ్లిసిటీలో వాడుకోవడం లేదు. నార్త్ లో అవసరం లేదు కానీ ఏపీ తెలంగాణలో దగ్గుబాటి అభిమానులు భారీగా ఉన్నారు. వాళ్ళను టార్గెట్ చేసుకున్నా చాలు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. రామ్ చరణ్ చేసిన చిన్న క్యామియోని సైతం ఊరికే ఒక పాటలో చూపించి వదిలేశారు. ఇవన్నీ ఇక్కడి బజ్ రావడానికి చాలా కీలకం.

పైగా ప్రమోషన్ల గురించి నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇప్పటిదాకా ఒక్క ఇంటర్వ్యూ లేదు. హీరోయిన్ పూజా హెగ్డే మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వెంకటేష్ గత నాలుగు రోజులుగా షూటింగ్ కోసం వైజాగ్ లోనే ఉన్నారు. ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారో లేదో తెలియదు. సల్మాన్ ఖాన్ ఓసారి హైదరాబాద్ వచ్చి వెంకీతో పాటు స్టేజి షేర్ చేసుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేస్తే బాగుండేది. మంచి హోమ్లీ టైటిల్ తో తెలుగులో డబ్ చేసినా బాగుండు.ఇవేవి లేకుండా నేరుగా థియేటర్లలో అడుగుపెడుతున్న భాయ్ జాన్ కు ఎలాంటి స్వాగతం దక్కుతుందో.