థియేటర్లలో ఎంత బాగా ఆడింది.. బాక్సాఫీస్ కొలమానాల్లో ఎక్కడ నిలుస్తుంది అన్నది పక్కన పెడితే.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి అనడంలో సందేహం లేదు. తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం కూడా ఇదే అనడంలో మరో మాట లేదు. కొన్ని సినిమాలు వస్తాయి. ఆడతాయి. వెళ్లిపోతాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. కాలం గడిచేకొద్దీ కల్ట్ స్టేటస్ అందుకుంటాయి. ‘జెర్సీ’ అలాంటి సినిమానే.
ఈ చిత్రానికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఓ తెలుగు చిత్రానికి అవకాశం దక్కడం అరుదైన విషయమే.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి, 15 వరకు కెనడాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నారు. హిందీ సహా వివిధ భారతీయ భాషల్లో అత్యుత్తమ చిత్రాల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందించాడు. విడుదలైనపుడు ఓ మోస్తరు విజయమే సాధించింది కానీ.. తర్వాత ‘జెర్సీ’ మాస్టర్ పీస్‌గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ కూడా ఈ సినిమా గొప్పదనాన్ని గుర్తించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుతో కలిసి కరణ్ జోహార్ ‘జెర్సీ’ పేరుతోనే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హిందీలోనూ గౌతమ్ తిన్ననూరినే రూపొందిస్తున్నాడు.