ఏ సినిమా బిజినెస్ లోనైనా పాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. టైటిల్ కార్డులో మ్యూజిక్ డైరెక్టర్ పేరుకి క్రేజ్ ఉంటే చాలు ట్యూన్లు ఎలా ఉన్నా పాసైపోతాయనే భ్రమలో తప్పటడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిత్రాలకు హైప్ తీసుకొచ్చేది సాంగ్స్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. జాతీయ అవార్డు సాధించిన కలర్ ఫోటో కథకుడు కం నిర్మాత సాయి రాజేష్ స్వీయ దర్శకత్వంలో బేబీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేదు. ఆనంద్ దేవరకొండ హీరో. తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ లేదు.
వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా విరాజ్ అశ్విన్ మరో కథానాయకుడు. వీళ్ళ పేరు మీద అమ్మకాలు చేయలేరు. అందుకే సాయిరాజేష్ ప్రత్యేకంగా పాటల మీద శ్రద్ధ వహించి విజయ్ బుల్గనిన్ తో మంచి అవుట్ ఫుట్ ని రాబట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ రిలీజ్ అయిన ఓ రెండు మేఘాలిలా పాట యూత్ కి మాములుగా రీచ్ అవ్వలేదు. సోషల్ మీడియా పుణ్యమాని ఓ రేంజ్ లో రీచ్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లోని 12 మంది సంగీత దర్శకులను గెస్టులుగా తీసుకొచ్చి వదిలిన దేవరాజా కూడా స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తోంది. ఫ్యూజన్ బీట్స్ లో క్లాసిక్ మిక్స్ చేయడం వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడివే బిజినెస్ తెచ్చి పెడుతున్నాయి. ట్రేడ్ టాక్ ప్రకారం బేబీకి పెట్టిన బడ్జెట్ ఓటిటి డిజిటల్ లో వచ్చేసిందట. ఇక థియేటర్ పరంగా వస్తున్న ఆఫర్లు నిర్మాత ఎస్కెఎన్ కి మూడింతల లాభం తెచ్చి పెట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇంకో మూడు పాటలు, ట్రైలర్ బాకీ ఉన్నాయి. వాటికి కూడా ఇదే స్థాయి రీచ్ వస్తే మంచి ఓపెనింగ్స్ నే ఆశించొచ్చు. చిన్న సినిమాలకు ఓ యాభై వంద స్క్రీన్లు దక్కి రిలీజ్ చేయడమే పెద్ద రిస్కుగా మారిపోతున్న ట్రెండ్ లో బేబీ ఇలా సైలెంట్ కిల్లర్ గా మారడం చూస్తుంటే మ్యూజిక్ ఎంత మేజిక్ చేస్తుందో చెప్పనక్కర్లేదు.