కెజిఎఫ్ 2 వచ్చి ఏడాది దాటింది కానీ

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఏప్రిల్ 14న విడుదలైన కెజిఎఫ్ చాఫ్టర్ 2 సృష్టించిన వసూళ్ల సునామిని ఇండియన్ బాక్సాఫీస్ అంత సులభంగా మర్చిపోలేదు. ఒక శాండల్ వుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల రాఖీ భాయ్ సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. నాలుగేళ్ల క్రితం కర్ణాటక దాటి బయట ఎవరికీ తెలియని హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయారు. మొదటి యానివర్సరి వచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా లేరు.

ఎందుకంటే యష్ కొత్త సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకులు వస్తున్నారు కథలు చెబుతున్నారు తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు. నర్తన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆ మధ్య టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత అతను శివరాజ్ కుమార్ తో మఫ్టీ సీక్వెల్ కు వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ కి సైతం ఒక లైన్ తో మెప్పించి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డాడు. లైగర్ షూటింగ్ టైంలో పూరి జగన్నాధ్ తో జరిపిన చర్చలు ఆ తర్వాత దాని ఫలితం చూశాక ముందుకెళ్లలేకపోయాయి. దీంతో యష్ ఎంత ఆలస్యమైనా సరే తొందరపడే సమస్యే లేదంటున్నాడు.

పోనీ కెజిఎఫ్ 3 ఉందా అంటే అదంత సులభంగా జరిగే వ్యవహారంలా లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ నుంచి బయటికి రావడానికి సెప్టెంబర్ దాటేస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద పని చేయాలి. ఎంతలేదన్నా ఇదయ్యేలోపు 2025 వచ్చేస్తుంది. సో ఛాన్స్ లేనట్టే. యష్ మనసులో ఏముందో మీడియాకు అంతుచిక్కడం లేదు. ఆ మధ్య పుట్టినరోజుకు ఏమైనా అనౌన్స్ మెంట్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది జరగలేదు. ఇప్పుడు కెజిఎఫ్ వార్షికోత్సవం వచ్చినా సరే ఇప్పుడప్పుడే కదలిక వచ్చే సూచనలైతే దగ్గర్లో కనిపించడం లేదు