వకీల్ సాబ్ 2 వచ్చే ఛాన్స్ ఉందా

నిన్న వకీల్ సాబ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి బాగానే ఉంది. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ ని మన కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగా మార్చిన తీరు మంచి విజయాన్ని అందించింది. వంద కోట్లు రాలేదు కానీ దాని బడ్జెట్ కి, ఏపీ సర్కారు పెట్టిన కఠిన నిబంధనలను తట్టుకుని తొంబై కోట్ల దాకా రావడం చిన్న విషయం కాదు. దీనికి సీక్వెల్ ఉంటుందని దిల్ రాజు ఆ టైంలో చెప్పారు కానీ తర్వాత ఎలాంటి ఊసు లేకుండా పోయింది. నిన్న ట్విట్టర్ స్పేస్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ నుంచి కొంత క్లారిటీ వచ్చింది.

వకీల్ సాబ్ రెండో భాగానికి కసరత్తు జరుగుతోందని త్వరలోనే ప్రకటన ఉండొచ్చనేలా సంకేతం ఇచ్చారు. ఈసారి పూర్తిగా కొత్త సబ్జెక్టు కాబట్టి కథేంటో ముందే తెలిసే ఛాన్స్ ఉండదు. అయితే ప్రాక్టికల్ గా ఇది ఎంత వరకు సాధ్యమనే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. వినోదయ సితం రీమేక్ పూర్తయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిపోయింది. ఓజి కూడా సమాంతరంగా జరిపేలా దర్శకుడు సుజిత్ పక్కా ప్లాన్ తో ఉన్నాడు. హరిహరవీరమల్లు పెండింగ్ వర్క్ ని దీపావళి లోగా పూర్తి చేసేలా నిర్మాత ఏఎం రత్నం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇవన్నీ అయ్యాకే వకీల్ సాబ్ 2 గురించి ఆలోచన చేసే అవకాశం దక్కుతుంది. కానీ ఆలోగా ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సూచనలు ఉండటంతో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఇకపై సీరియస్ గా పొలిటికల్ ఎఫైర్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎంత నిధుల కోసమే అయినా ఇలా ఎక్కువ కాలం సెట్స్ లో ఉంటే ప్రజలకు తనకు దూరం పెరిగిపోతుంది. అదో కొత్త ఒత్తిడికి దారి తీస్తుంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే సినిమాలకు తాత్కాలికంగా అయినా సరే బ్రేక్ తీసుకోవాలి. మరి వకీల్ సాబ్ 2 వచ్చే అవకాశం దగ్గర్లో లేనట్టేగా.