ఆ సినిమా సంగతేంటి బన్నీ

అల్లు అర్జున్ హీరోగా ఎప్పుడో ఏడాదిన్నర కిందట ‘ఐకాన్’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించాల్సిన చిత్రమిది . సినిమా పట్టాలెక్కకముందే టైటిల్, ప్రి లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. తర్వాత ‘ఐకాన్’ పేరుతో ఉన్న టోపీ కూడా పెట్టుకుని బయట తిరిగేశాడు బన్నీ.

అప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు సన్నాహాలు జరుగుతుండటంతో దాని తర్వాత పట్టాలెక్కే చిత్రం ఇదే అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ ఆల్రెడీ లైన్లో ఉంది. ఇంతలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ప్రకటించాడు. అది 2022 ఆరంభంలో రిలీజవుతుందని చెప్పడం ద్వారా.. ‘పుష్ప’ తర్వాత చేయబోయే సినిమా ఇదే అని సంకేతాలిచ్చేశాడు.

ఈ మధ్య బన్నీ పుట్టిన రోజు సందర్భంగా కూడా ‘ఐకాన్’ వార్తల్లో నిలిచింది. ఈ చిత్ర బృందం తరఫున దిల్ రాజు బన్నీకి శుభాకాంక్షలు చెప్పాడు. తద్వారా ఈ సినిమా గురించి బన్నీకి గుర్తు చేసినట్లుగా ఉంది. కానీ బన్నీ మాత్రం వచ్చే రెండేళ్లలో కూడా ఈ సినిమా లేదని సంకేతాలిచ్చేశాడు. ఐతే బన్నీకి ఈ కథ నచ్చిందని.. ఏదో ఒక సమయంలో తప్పకుండా ఈ సినిమా చేస్తానని వేణుకు హామీ ఇచ్చాడని అల్లు హీరోకు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మరి బన్నీకి ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో.. ‘ఐకాన్’ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియడం లేదు. ఒక కథ విషయంలో నిజంగా ఎగ్జైట్ అయితే.. దాన్ని పక్కన పెట్టేసి ఇలా సినిమా తర్వాత సినిమా అనౌన్స్ చేసుకుంటూ వెళ్లరు. మరి ‘ఐకాన్’తో బన్నీకి వచ్చిన ఇబ్బందేంటో తెలియదు. వేణుకు మధ్యలో పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే బన్నీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయేవాడు. అయినా ఈ సినిమా అయ్యాక కూడా అతడికి ఎదురు చూపులైతే తప్పేలా లేవు.