సుకుమార్ కూడా ఆ ట్రాప్‌లో పడిపోయాడే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథలు కానీ.. సన్నివేశాలు కానీ.. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయి. ఆయనతో పని చేసిన వాళ్లు చెప్పే దాని ప్రకారం.. ఒక సన్నివేశం రాసేటపుడు, తీసేటపుడు.. లేదా ఒక డైలాగ్ రాసేటపుడు.. ప్రేక్షకులు ఏం అంచనా వేస్తారు అని ఆలోచించి.. దానికి భిన్నంగా ఆయన రాత, తీత ఉంటుందని అంటారు. సుకుమార్ ఏం చేసినా.. ప్రేక్షకుల ఆలోచనలకు కొన్ని అడుగులు ముందే ఉంటారని చెబుతారు. ‘పుష్ప’ సినిమాలో హీరో సహా ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలోనూ ఆయన మార్కు స్పష్టంగా కనిపించింది.

పుష్ప పాత్రకు సంబంధించి నెగెటివ్ షేడ్స్ విషయంలో కాస్త మిశ్రమ స్పందన వచ్చినా.. మెజారిటీ ప్రేక్షకులకు ఆ పాత్ర మంచి కిక్కు ఇచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి పాత్రలను రాబిన్ హుడ్ తరహాలో తీర్చిదిద్దుతుంటారు. దొరల్ని కొట్టి పేదలకు పంచడం అనే ఫార్మాట్ ఫాలో అయిపోతుంటారు.

కానీ ‘పుష్ప: ది రైజ్’లో మాత్రం హీరో పాత్ర అలా కనిపించలేదు. పూర్తిగా తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే పాత్రలా కనిపించాడు పుష్పరాజ్. అతడిలోని హ్యూమన్ యాంగిల్ ఎక్కడా కనిపించలేదు. ఒక స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏంటి అంటూ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మెజారిటీ ప్రేక్షకులు ఇవేమీ పట్టించుకోలేదు. స్మగ్లింగ్ ద్వారా డబ్బులు సంపాదించి.. లేని వాళ్లకు సాయం చేసినట్లు చూపిస్తే ఆ పాత్ర రొటీన్ అయిపోతుందని.. అలా లేకపోవడమే పాత్రకు వైవిధ్యాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు ఈ వర్గం ప్రేక్షకులంతా. కానీ ‘పుష్ప: ది రూల్’ దగ్గరికి వచ్చేసరికి సుకుమార్ కూడా అందరి దారిలోనే నడిచాడు.

టీజర్లో పుష్ప ద్వారా సాయాలు పొందిన వాళ్లందరూ అతను కనిపించకపోయేసరికి ఆందోళన చెందుతూ తన గురించి గొప్పగా చెప్పిన షాట్స్ చూపించారు. దీంతో సెకండ్ పార్ట్‌లో పుష్ప పాత్ర తీరు ఎలా ఉండబోతుందో ఒక అంచనా వచ్చేసింది. సుక్కు నుంచి వైవిధ్యం కోరుకునే వారికి ఇది కొంచెం నిరాశ కలిగించిన విషయమే అని చెప్పాలి.