‘ఆదిపురుష్’ ట్రోలింగ్‌కి చిన్న బ్రేక్

ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న ఏ సినిమా మీద జరగనంత ట్రోలింగ్ ‘ఆదిపురుష్’ మీద జరిగింది. గత ఏడాది ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజైనపుడు మొదలైంది ఈ ట్రోలింగ్ మోత. రామాయణ గాథను మళ్లీ వెండితెరపైకి తెస్తున్నారంటే ప్రేక్షకులు ఊహించుకున్నది ఒకటి. టీజర్లో చూపించింది మరొకటి. ఈ పురాణ గాథలోని డివైనిటీని మొత్తం దెబ్బ తీసేలాగా.. టీజర్ అంతా కూడా చాలా కృత్రిమంగా కనిపించడంతో జనాలకు దిమ్మదిరిగిపోయింది. దీంతో ఆ టీజర్ విపరీతమైన విమర్శలకు గురైంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేసినా కూడా ఫలితం లేకపోయింది.

సినిమాను జనవరి నుంచి జూన్‌కు వాయిదా వేసి వీఎఫ్ఎక్స్ మీద మళ్లీ వర్క్ చేస్తోంది చిత్ర బృందం. కాగా కొత్త ప్రోమోలతో అయినా ఏమైనా నెగెటివిటీని తగ్గిస్తారేమో అనుకుంటే.. ఇటీవలే శ్రీరామనవమికి రిలీజ్ చేసిన పోస్టర్ చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చింది. ఓం రౌత్ అండ్ కోను ఇంకో రౌండు గట్టిగా వేసుకున్నారు.

‘ఆదిపురుష్’ మీద కాస్తో కూస్తో ఉన్న ఆశలు మొన్నటి పోస్టర్‌తో పోయాయి అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంత నెగెటివిటీని దాటి ఈ సినిమా ఎలాంటి ఫలితం రాబడుతుందో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ నుంచి కాస్త సానుకూలమైన స్పందన రాబట్టే ప్రోమో ఒకటి బయటికి వచ్చింది. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా సినిమా నుంచి ‘జై శ్రీరామ్’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇన్‌స్టంట్‌గా జనాలకు కనెక్టయింది.

లయబద్ధంగా సాగుతూ.. ఒక డివైన్ ఫీలింగ్ కలిగించేలా ఆ పాట ఉండటంతో అందరూ పాజిటివ్ కామెంట్లే చేస్తున్నారు. సంగీత దర్శకులు అజయ్-అతుల్ పుణ్యమా అని ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ మీద ట్రోలింగ్‌కు కాస్త అడ్డుకట్ట పడిందని.. ఈ పాజిటివిటీని తొలి మెట్టుగా చేసుకుని ఇక ముందు అయినా జాగ్రత్తగా ప్రోమోలు రిలీజ్ చేసి సినిమాకు తిరిగి హైప్ తీసుకురావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.