సల్మాన్ వెంకీతో చరణ్ లుంగి డాన్స్

Yentamma - Kisi Ka Bhai Kisi Ki Jaan | Salman Khan,Ram Charan,Venkatesh,Pooja| Vishal,Payal,Raftaar
Watch: Ram Charan’s Lungi Dance with Sallu Bhai & Venky Mama

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన కిసీకా భాయ్ కిసీకా జాన్ ఈ నెల 21 విడుదల కానుంది. హైప్ పరంగా కొంత నెమ్మదిగానే కనిపిస్తున్నప్పటికీ టీమ్ ఒక్కొక్కటిగా ఇందులో ఉన్న ప్రత్యేకతలను ప్రమోషన్ ఆయుధాలుగా బయటికి తీస్తోంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన బతుకమ్మ సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ కాగా తాజాగా ఏంటమ్మ అనే మరో పాటని వీడియోతో సహా వదిలేశారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో పాటు నాన్న చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సల్మాన్ వెంకటేష్ లతో కలిసి డాన్స్ చేయడం.

చిన్న బిట్ అయితే ఏదో అనుకోవచ్చు. ఊర మాస్ స్టైల్ లో లుంగీని తొడలపైకి కట్టి ముఠామేస్త్రి స్టైల్ లో ముగ్గురు కలిసి కాలు కదుపుతుంటే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. పూజా హెగ్డే సైతం అదే గెటప్ లో తోడు కావడం మరో ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ గట్రా చూస్తుంటే ఆచార్య సెట్ కే కొన్ని మరమత్తులు చేసి దీనికోసం వాడుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో చరణ్ చిన్న క్యామియో చేశాడనే విషయం నెలల క్రితమే సల్మాన్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ ఏ గెటప్ లో ఎలా వస్తాడనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది.

అయితే కేవలం ఈ కొన్ని సెకండ్ల వీడియోకే మెగా పవర్ స్టార్ పరిమితమా లేక కొన్ని నిమిషాల పాటు కనిపించే ఏదైనా ప్రత్యేక పాత్ర ఇచ్చారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫర్హాద్ సంజి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సల్మాన్ నలుగురు తమ్ముళ్లున్న పెళ్లికాని బ్రహ్మచారిగా నటిస్తున్నారు. స్టోరీ లైన్ కాటమరాయుడుకి దగ్గరగా ఉందనే టాక్ తిరుగుతోంది కానీ వెంకటేష్ పాత్ర చూస్తే ఇదేదో ఫ్రెష్ గా రాసినట్టే అనిపిస్తోంది. సల్మాన్ వెంకీ చరణ్ లు కలిసి డాన్స్ చేసిన ఈ అరుదైన పాటకు పాయల్ దేవ్ స్వరాలు సమకూర్చారు.