బాలయ్యకు పూర్వ వైభవం

యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు.. రూలర్.. ఇలా వరుసగా మూడు డిజాస్టర్లతో ఒక దశలో కెరీర్లో ఊహించని పతనం చవిచూశాడు బాలయ్య. ‘నరసింహనాయుడు’ తర్వాత దాదాపు పదేళ్లు తీవ్రంగా ఇబ్బంది పడి.. ఆ తర్వాత సింహా, లెజెండ్ లాంటి చిత్రాలతో పుంజుకుని కొన్నేళ్లు బాగానే బండి నడిపించిన బాలయ్య.. కెరీర్లో ఈ దశలో తగిలిన వరుస ఎదురు దెబ్బల నుంచి ఇక కోలుకోవడం కష్టమే అని చాలామంది అనుకున్నారు.

యువ కథానాయకుల హవా నడుస్తున్న ఈ రోజుల్లో బాలయ్య తన మార్కు మాస్ సినిమాలతో ఇక ప్రేక్షకులను మెప్పించడం కష్టమే అని తీర్మానించేశారు. బాలయ్యకు అప్పటికే రెండు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బోయపాటి శ్రీను సైతం ఆయన్ని మళ్లీ పైకి లేపలేడని కామెంట్లు చేశారు. కానీ ‘అఖండ’తో మొత్తం కథ మారిపోయింది. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయింది. ఇక ఈ సంక్రాంతికి రిలీజైన ‘వీరసింహారెడ్డి’ సైతం డివైడ్ టాక్‌ను తట్టుకుని సూపర్ హిట్టయింది.

బాలయ్య మళ్లీ ఇలా కెరీర్లో పీక్స్‌ను అందుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. అనిల్ రావిపూడి లాంటి మరో ట్రెండీ డైరెక్టర్‌తో జట్టు కట్టడంతో ఆయన కొత్త సినిమాకు బంపర్ క్రేజ్ కనిపిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. విడుదలకు ఆరు నెలల ముందే ‘ఎన్బీకే 108’ డిజిటల్ హక్కులు అమ్ముడైపోయాయట. అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఏకంగా రూ.36 కోట్లు పెట్టి ఈ సినమా డిజిటల్ హక్కులను తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

కేవలం ఓటీటీ హక్కులతోనే ఇంత మొత్తం అంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేట్రికల్ హక్కులు ఏ స్థాయి రేటు పలుకుతాయో అంచనా వేయొచ్చు. ఈజీగా ఓవరాల్ బిజినెస్ రూ.120 కోట్ల మార్కును దాటేయొచ్చు. ‘రూలర్’ అనే సినిమాకు ఓవరాల్ బిజినెస్ గట్టిగా 40 కోట్లు కూడా అవ్వలేదు. అలాంటిది ఇంకో రెండు సినిమాలు అయ్యేసరికి అంతకు మూడు రెట్ల బిజినెస్ అంటే బాలయ్య రేంజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ‘నరసింహనాయుడు’ రోజుల నాటి వైభవాన్ని బాలయ్య చూస్తున్నాడనే చెప్పాలి.