నిరీక్ష‌ణ‌కు తెర‌దించిన తార‌క్

జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే క్ష‌ణాల కోసం అభిమానుల నిరీక్ష‌ణ ఇప్ప‌టిది కాదు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో అనుకున్న సినిమా క్యాన్సిల్ అయి.. కొర‌టాల శివ‌తో కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించి రెండేళ్లు దాటిపోయింది. ఈ సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బాగా ఆల‌స్యం అయింది. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి తార‌క్ అన్ని ప‌నులూ ముగించాక కూడా ఏడాదికి కానీ ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకోలేదు.

కొన్ని రోజుల కింద‌టే హైద‌రాబాద్‌లోని ఒక హోట‌ల్లో ఈ సినిమా ముహూర్త వేడుక జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కే చాలా టైం తీసుకోవ‌డంతో ఇక షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడో అని అభిమానులు సందేహించారు. కానీ వాళ్లు ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది. శ‌నివార‌మే ఈ సినిమా షూటింగ్ మొద‌లైపోయింది.

ఎన్టీఆర్ కొత్త సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు విప‌రీతంగా గొడ‌వ చేస్తుండ‌టాన్ని చాలా రోజులుగా గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఈ విష‌యంలో తార‌క్ సైతం కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఐతే షూటింగ్ మొద‌లైన విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగానే ఒక వీడియో ద్వారా వెల్ల‌డించింది. నైట్ సెట‌ప్‌తో ఉన్న సెట్లోకి ఎన్టీఆర్ న‌డుచుకుంటూ వెళ్ల‌డం.. అత‌ణ్ని కొర‌టాల శివ ఆహ్వానించ‌డం ఈ వీడియోలో చూపించారు.

ఐతే తార‌క్‌ను వెనుక నుంచి మాత్ర‌మే చూపించారు. లుక్ రివీల్ చేయ‌లేదు. చూస్తుంటే.. తార‌క్ గ‌డ్డంతో షూట్‌కు హాజ‌రైనట్లు క‌నిపిస్తోంది. సెట్‌ను డీప్‌గా చూపించ‌క‌పోయినా.. లావిష్‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. వీడియో చివ‌ర్లో వస్తున్నా.. అంటూ ఎన్టీఆర్ ఆగ‌మ‌నాన్ని చాటి చెప్పారు. తార‌క్ స‌ర‌స‌న జాన్విక‌పూర్ న‌టించ‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5కు విడుద‌ల కాబోతున్న‌ట్లు ఇంత‌కుముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.