150 రోజుల్లో ‘రోలెక్స్’ సినిమా

గత ఏడాది తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఊపేసిన సినిమా ‘విక్రమ్’. ఇందులో సినిమా అంతా ఉండే కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ల పాత్రలు ఎంత హైలైట్ అయ్యాయో.. చివర్లో పది నిమిషాలు మాత్రమే కనిపించే రోలెక్స్ క్యారెక్టర్ కూడా అంతే పండింది. ఈ పాత్రలో సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, నటన, ఆ పాత్రను దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎలివేట్ చేసిన తీరు జనాలకు విపరీతంగా నచ్చేసింది.

అదొక కల్ట్ క్యారెక్టర్ లాగా నిలిచిపోయింది. భవిష్యత్తులో ఈ పాత్ర మీదే పూర్తి స్థాయి సినిమా తీస్తానని లోకేష్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. తన తర్వాతి చిత్రం సూర్యతోనే ఉండొచ్చని అతను సంకేతాలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమానికి లోకేష్, కమల్‌లతో పాటు సూర్య కూడా హాజరు అయ్యారు.

ఈ వేదిక మీద కమల్.. సూర్యను నుదుటి మీద ముద్దు పెట్టుకుని ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్ర చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ‘‘రోలెక్స్ పాత్ర ఈ సినిమా మరింతగా జనాలకు చేరువయ్యేలా చేసింది. ఈ పాత్ర చేయడానికి అంగీకరించినందుకు సూర్యకు మరోసారి థ్యాంక్స్. ఒక్క ఫోన్ కాల్‌తో సూర్య వెంటనే ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడు. అతడితో ఈ పాత్ర చేయించాలన్నది మేం చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం’’ అని కమల్ చెప్పాడు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. సూర్యతో తన సినిమాను కన్ఫమ్ చేశాడు. ‘‘సూర్యతో సినిమా చేయాలని నాక్కూడా చాలా ఆసక్తిగా ఉంది. తప్పకుండా ఆయనతో సినిమా ఉంటుంది. వీలైనంత త్వరగా ఆ చిత్రాన్ని మొదలు పెట్టి 150 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా’’ అన్నాడు. ప్రస్తుతం లోకేష్.. విజయ్ హీరోగా ‘లియో’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.