క్లాసిక్ ఖైదీని ఖంగాళీ చేశారు

ఇవాళ లోకేష్ కనగరాజ్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే దానికి మొదటి కారణం ఖైదీ. వరస ఫ్లాపులతో కార్తీ సతమవుతున్న టైంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ దీని రూపంలో దక్కింది. తెలుగులోనూ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా తెరకెక్కించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది.

కమర్షియల్ అంశాలకు దూరంగా ప్రయోగాలు చేసినా ఆడియన్స్ ఆదరిస్తారనే దానికి మంచి ఉదాహరణగా నిలిచింది. అజయ్ దేవగన్ కోరి మరీ భోళాగా స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేసుకున్నారు. మొన్న విడుదలైన భోళాకు డీసెంట్ ఓపెనింగ్స్ అయితే దక్కాయి కానీ మరీ ఆశించిన స్థాయిలో మేజిక్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఒరిజినల్ ఖైదీలో ఏదైతే ఫ్లేవర్ ఉందో దానికి మసాలా కోటింగ్ ఇవ్వడంతో ఇది కాస్తా రొటీన్ ఖంగాళీ వ్యవహారంగా మారిపోయింది.

ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ని పెట్టడమే ట్విస్టు అనుకుంటే ఏకంగా పాటను కూడా సెట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో కీలకంగా నిలిచిన తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ని ఏ మాత్రం పండించలేకపోయారు. ఐటెం సాంగ్ స్పెషల్ బోనస్. యాక్షన్ సన్నివేశాలకు ఓవర్ ది బోర్డ్ అనే మాట చాలా చిన్నది. ఇక కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపధ్య సంగీతం చెవులు హోరెత్తిపోయేలా చేసింది.

ఇటీవలే కబ్జకు పేలవమైన స్కోర్ అందించిన ఇతను ప్రభాస్ సలార్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోనని ఫ్యాన్స్ టెన్షన్ పడటం ఖాయం. సౌండ్ తప్ప రిథమ్ లేకుండా ఇస్తున్నారు బీజీఎమ్. గ్రాండియార్ పరంగా ఖర్చు బాగానే పెట్టినప్పటికీ చాలా చోట్ల టెక్నికల్ వర్క్ చీప్ గానే అనిపిస్తుంది. ఖైదీ చూసినవాళ్లు భోళాని చివరిదాకా భరించడం కష్టం. అజయ్ దేవగన్ మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్ప ఛాయస్ గా పెట్టుకోలేం. దృశ్యం 2 రికార్డులు పక్కా సేఫ్