దిల్ రాజు పంట పండింది

నిర్మాతగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదులుకోలేదు దిల్ రాజు. ఇప్పటికీ నైజాం, వైజాగ్ ఏరియాల్లో ఆయనే నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్. టాలీవుడ్లో రిలీజయ్యే మెజారిటీ పెద్ద సినిమాలను ఈ రెండు ఏరియాల్లో ఆయనే రిలీజ్ చేస్తుంటారు. ఇందుకోసం ఫ్యాన్సీ రేట్లు ఇస్తుంటాడు. ఒక సినిమా స్టామినా ఏంటో సరిగ్గా అంచనా వేసి రేట్ కోట్ చేయడం, బెస్ట్ స్క్రీన్లతో పర్ఫెక్ట్ రిలీజ్ ఉండేలా చూసుకోవడంలో తనకు తానే సాటి అనిపిస్తుంటాడు రాజు.

అందుకే డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఇటీవలే నిర్మాతగా ‘బలగం’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్న రాజుకు.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఒక సూపర్ సక్సెస్ దక్కబోతోంది. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘దసరా’ను నైజాం ఏరియాలో రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో సినిమాకు నైజాంలో రూ.9 కోట్ల రేటు ఆఫర్ చేయడం పట్ల ఆ మధ్య చాలామంది ఆశ్చర్యపోయారు.

రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడని.. నాని చివరి సినిమా ‘అంటే సుందరానికీ’ వరల్డ్ వైడ్ కలెక్షన్లు కూడా అంత లేనపుడు, కేవలం నైజాం వరకే అంత రేటు పెట్టడం ఏంటని కౌంటర్లు వేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘దసరా’ సినిమా కేవలం రెండు రోజుల్లో రాజు పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. తొలి రోజే తెలంంగాణలో ఈ చిత్రం రూ.6.75 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. రెండో రోజు మూడు కోట్లకు పైగానే షేర్ వచ్చింది.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ‘దసరా’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి కానీ.. నైజాంలో మాత్రం సినిమా బలంగానే నిలబడింది. శనివారం సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఆదివారం కూడా నైజాంలో ఈ సినిమా దుమ్ముదులపడం ఖాయం. ఇది పక్కా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ ఏరియాలో అద్భుతాలు చేసేలా కనిపిస్తోంది. వీకెండ్డో రూ.15 కోట్ల షేర్ మార్కును టచ్ చేసేలా ఉన్న ‘దసరా’.. ఫుల్ రన్లో ఈజీగా రూ.20 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. అంటే రాజు పెట్టుబడి మీద రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయం రాబోతుందన్నమాట. అంటే రాజు పంట పండినట్లే.