నేచురల్ స్టార్ నాని చాలా వరకు వివాదాలకు దూరంగానే ఉంటాడు. కాంట్రవర్శల్ కామెంట్స్ చేయడు. కానీ తన సినిమాతో పాటు ఇండస్ట్రీకి నష్టం జరుగుతోందన్న ఆవేదనతో అతను ఏడాదిన్నర కిందట చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను అమాంతం తగ్గించేయడం రెండేళ్ల కిందట పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో నాని ఒక కామెంట్ చేశాడు.
తన సినిమా ’శ్యామ్ సింగరాయ్’ విడుదలకు ముందు.. సినిమా టికెట్ కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా కొట్టు కౌంటర్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంటోందంటూ నాని చేసిన కామెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు రుచించలేదు. దీంతో థియేటర్లపై దాడుల పేరుతో ‘శ్యామ్ సింగ రాయ్’కి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఐతే ఆ అడ్డంకులను అధిగమించి నాని సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు నాని కొత్త సినిమా ‘దసరా’ రిలీజ్‌కు రెడీ అయింది.
నాని గత చిత్రం ‘అంటే సుందరానికీ’తో పోలిస్తే దీనికి మంచి క్రేజ్ ఉంది. వేసవిలో వస్తున్న తొలి క్రేజీ మూవీ కావడంతో దీనికి ఏపీలో అదనపు షోలు, టికెట్ల ధరలో పెంపును ఆశిస్తోంది చిత్ర బృందం. ఐతే వేరే చిత్రాలకు కొంచెం ఈజీగానే పర్మిషన్లు ఇచ్చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఈ సినిమా విషయంలో నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
విడుదలకు రెండు రోజులే సమయం ఉండగా.. ఏపీలో ఏ మేజర్ సిటీ, టౌన్‌లోనూ పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ముందు నార్మల్ షోలు, రేట్లకు బుకింగ్స్ ఓపెన్ చేస్తే.. తర్వాత పర్మిషన్లు వచ్చినా ఇబ్బంది తప్పదు. అందుకే చాలా వరకు బుకింగ్స్ మొదలుపెట్టకుండా అట్టిపెట్టారు. ఈ అనుమతులు ఎప్పటికి వస్తాయో తెలియడం లేదు. నాని ఫ్యాన్స్, ఈ సినిమా మీద ఆసక్తి ఉన్న వారు మాత్రం ఎప్పుడు బుకింగ్స్ ఓపెనవుతాయా అని చూస్తున్నారు.