ఇద్దరు దర్శకుల ప్లానింగ్ అమోఘం

స్టార్ హీరోలతో సినిమాలు మొదలుపెట్టడమే మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు పూర్తవుతుందనేది ఎవరూ చెప్పలేరు. పరిస్థితులు అలా ఉన్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా వందల కోట్ల మార్కెట్ ఉన్న దర్శకులకే ఈ తిప్పలు తప్పడం లేదు. కానీ కొందరు డైరెక్టర్లకు అదృష్టంతో పాటు ప్లానింగ్ విషయంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వేగం విషయంలో పోటీ అనేది లేకుండా చేస్తుంది. ముందుగా సముతిరఖని సంగతి చూస్తే పవన్ కళ్యాణ్ తో టాకీ పార్ట్ ని కేవలం నెల రోజుల్లోపే పూర్తి చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. బ్యాలన్స్ ఉన్నది మిగిలిన ఆర్టిస్టులతోనే.

ఎంత ముందుగా ప్రణాళిక వేసుకున్నా జనసేన వ్యవహారాలను చూసుకుంటున్న పవన్ తో ఇంత ఫాస్ట్ గా షూట్ ఫినిష్ చేయడం మాములు ట్విస్టు కాదు. ఎంత సబ్జెక్టు డిమాండ్ చేయకపోయినా క్వాలిటీని మిస్ కాకుండా త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని ఇంత పకడ్బందీగా తెరకెక్కించడం అందులోనూ పవర్ స్టార్ మొదటిసారి కాంబోలో ఇలా కలిసి రావడం లక్కే. ఇక రెండో వ్యక్తి లోకేష్ కనగరాజ్. విజయ్ తో అతను చేస్తున్న లియో దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉంది. నిన్నా మొన్న స్టార్ట్ చేసినట్టు అనిపిస్తున్నా మరీ ఇంత వేగంగా తీయడం అది కూడా ప్యాన్ ఇండియా మూవీ అంటే మాటలు కాదు.

కాశ్మీర్ షెడ్యూల్ మొదలుకుని చెన్నై ఎపిసోడ్ దాకా లోకేష్ చాలా పర్ఫెక్ట్ స్కెచ్ తో లియోని తీసి అక్టోబర్ 19 విడుదలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయనని హామీ ఇచ్చేశాడు. ఈ తరహా కమిట్ మెంట్ అందరూ హీరోలు దర్శకులకు వస్తే థియేటర్లకు జనాన్ని తీసుకొచ్చే కంటెంట్ కి కొరత ఉండదు. ఒకప్పుడు పూరి జగన్నాధ్ ఇలాంటి ట్రాక్ రికార్డు మైంటైన్ చేసేవాడు. అనిల్ రావిపూడి సైతం సరిలేరు నీకెవ్వరుని త్వరగా ఫినిష్ చేశాడు. పవన్ కళ్యాణ్, విజయ్ లాంటి స్టార్ హీరోలను డీల్ చేస్తున్నా సరే ఇంత కూల్ గా లోకేష్, ఖనిలు గుమ్మడికాయలు సిద్ధం చేయడం విశేషమే.