సమంత సినిమా కోసం 14 కోట్ల బంగారం


పౌరాణిక చిత్రాల్లో ధగధగా మెరిసిపోయే కిరీటాలు, ఆభరణాలు అన్నీ కూడా డూప్లికేట్‌వే ఉంటాయన్న సంగతి తెలిసిందే. నాటకాల దగ్గర్నుంచి సినిమాల వరకు ఇలాంటి వస్తువులన్నీ అట్ట ముక్కలతో తయారు చేసి వాటికి గోల్డ్ కలర్ కోటింగ్ వేయిస్తారు. ఐతే పూర్వ కాలంలో మాత్రం ‘దాన వీర శూర కర్ణ’ లాంటి కొన్ని సినిమాల్లో ఒరిజినల్ బంగారు ఆభరణాలనే తెప్పించి ప్రధాన పాత్రధారులు వాటినే ధరించి చిత్రీకరణలో పాల్గొన్నారు. సహజత్వం కోసం అప్పట్లో ఇలా చేశారు.

కానీ అప్పుడంటే బంగారం కొంచెం చవగ్గానే దొరికేది. అద్దెకు తెచ్చుకోవడానికి కూడా వీలుండేది. కానీ బంగారం బాగా ఖరీదైపోయిన ఈ రోజుల్లో సినిమా షూటింగ్స్ కోసం ఒరిజినల్ బంగారం వాడటం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆభరణాల కోసం కోట్లల్లో బడ్జెట్ పెట్టాలి. వందల మంది పాల్గొనే షూటింగ్‌లో ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవన్నీ చాలా కష్టమైన విషయాలే అయినప్పటికీ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రాజీ పడట్లేదు.

ఇంతకుముందు తనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన పౌరాణిక చిత్రం ‘రుద్రమదేవి’ కోసం గుణశేఖర్ నిజం బంగారంతోనే ఆభరణాలు చేయించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆయన తన సొంత సంస్థలోనే రూపొందించిన ‘శాకుంతలం’కి కూడా ఇదే ట్రెండును ఫాలో అయ్యాడట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.14 కోట్లు ఖర్చుపెట్టి ఆభరణాలు చేయించాడట గుణశేఖర్.

“శాకుంతలంలో సమంత సహా ప్రధాన పాత్రధారుల కోసం రూ.14 కోట్ల విలువైన బంగారం, వజ్ర ఆభరణాలను వాడాం. ఇందుకోసం 15 కిలోల బంగారం ఉపయోగించాం. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ గారు బంగారు కిరీటం సహా కొన్ని ఆభరణాలు వాడిన విషయం తెలిసి ఆ స్ఫూర్తితోనే నా సినిమాల్లో నిజమైన ఆభరణాలు వాడుతున్నా. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడు, మేనక పాత్రలకు ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా సారథ్యంలో ఆభరణాలు తయారు చేయించాం. వసుంధర జువెలర్స్ వాళ్లు 7 నెలలు శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. సమంత కోసమే 14 రకాల ఆభరణాలు తయారు చేయించాం. పూర్తిగా చేత్తో చేసిన ఆభరణాలు పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని, సహజత్వాన్ని తీసుకొచ్చాయి” అని గుణశేఖర్ తెలిపాడు.