నానిని అవమానించిన దర్శకుడెవరు?


ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెడితే నిలదొక్కుకుని, ఒక స్థాయి అందుకునేవరకు ఎన్నో ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కోక తప్పదు. స్వయంగా తమకు కూడా గతంలో చేదు అనుభవాలు ఉన్నటిప్పటికీ కొందరు దర్శకులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. అసిస్టెంట్ల మీద విరుచుకుపడుతుంటారు. ఏమైనా అంటే ఇక్కడ ఇవన్నీ కామన్.. పట్టించుకోకూడదు అంటారు. ఇలాంటి అనుభవాల గురించి ఒక స్థాయికి ఎదిగాక చాలామంది కథలు కథలుగా చెబుతుంటారు. ఈ జాబితాలోకి నేచురల్ స్టార్ నాని కూడా చేరాడు.

అతను ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. క్లాప్ అసిస్టెంట్‌గా మొదలుపెట్టి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయి.. అనుకోకుండా ‘అష్టాచెమ్మా’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన నాని.. తొలి సినిమాతోనే ప్రతిభ చాటుకోవడంతో తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కానీ క్లాప్ అసిస్టెంట్‌గా ఉన్న రోజుల నుంచి తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఓపెనయ్యాడు.

“నేను ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నాక అనుకోకుండా నటుడినై నిలదొక్కుకున్నా. ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్పలేను. ఐతే క్లాప్ అసిస్టెంట్‌గా ఉంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే.. నిన్ను ఏదైనా అనేయాలనుకుంటారో, ఏదైనా చెప్పేయొచ్చు అనుకుంటారు. ఇష్టం వచ్చినట్లు మాటలు అంటారు. వాళ్లందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నింటినీ దిగమింగక తప్పదు. అలాంటి ఇబ్బందులు నేను చాలానే ఎదుర్కొన్నా. క్లాప్ బోర్డు కొంచెం ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారు. మాటలు పడ్డందుకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. కానీ ఒక దర్శకుడు మాత్రం సెట్లో అందరి ముందూ నన్ను అవమానించాడు. నేను ఎప్పటికీ దర్శకుడిని కాలేనన్నాడు. ఆ మాట నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అలాంటి ఎన్నో మాటల్ని దాటి ఈ స్థాయికి వచ్చా. హీరోగా ఒక స్థాయి అందుకున్నాక ఆ దర్శకుడిని కలిశా. అప్పుడు కూడా మా మధ్య వాతావరణం అంత బాగా ఏమీ లేదు” అని నాని తెలిపాడు.