వరస దెబ్బలకు మాస్ టర్నింగ్ తప్పలేదు

టాలెంట్ అందం రెండూ ఉన్నా అదృష్టం కలిసిరాక నాగశౌర్య ఏ జానర్ ని తడుముకున్నా డిజాస్టర్లే పడుతున్నాయి. ఇటీవలే వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి దారుణంగా బోల్తా కొట్టడం జీర్ణించుకోలేకపోతున్నాడు. మరీ ఓవర్ క్లాస్ దట్టించేసి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయిన స్టోరీలైన్ తో దాన్ని తీర్చిదిద్దిన తీరు కనీసం యూత్ ని ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకున్న కృష్ణ వృంద విహారి సైతం కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లక్ష్య, రామ్ కామ్ వరుడు కావలెను, సైకో థ్రిల్లర్ అశ్వద్ధామ యావరేజ్ నుంచి ఫ్లాప్ మధ్యలో ఊగిసలాడాయి. ఇవేవి మాస్ ఎంటర్ టైనర్లు కాదు. అన్నీ అంతో ఇంతో క్లాస్ టచ్ ఉన్నవే. అందుకే ఈసారి పూర్తిగా మాస్ టర్నింగ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు కాబోలు. తల్లి ఉషా నడిపించే స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ తాజాగా త్రినాథరావు నక్కినతో టైఅప్ చేసుకుంది. ఆ మేరకు అధికారికంగా కూడా చెప్పేశారు. అయితే నాగశౌర్య హీరో అని రివీల్ చేయలేదు కానీ తనే కన్ఫర్మనేది ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతానికి డైరెక్టర్ మాత్రమే ప్రకటించారు.

ధమాకా బ్లాక్ బస్టర్ తో త్రినాథరావు ఊపుమీదున్నాడు. ఒకవేళ నాగశౌర్యని కనక వెంకీ కుడుముల ఛలో టైపులో వినోదాత్మకంగా చూపిస్తే బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ చేయొచ్చు. ఇది కాకుండా శౌర్య ఆల్రెడీ సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదీ మాస్ సబ్జెక్టే. రేపు ఉగాదికి టైటిల్ లాంచ్ చేయబోతున్నారు. మొత్తానికి కుర్రాడికి బాక్సాఫీస్ తత్వం ఆలస్యంగా బోధపడింది. ఎంతసేపూ సాఫ్ట్ కథలతో పని జరగదని గుర్తించి గేరు మార్చాడు. అప్పట్లో పోలీసు వారి హెచ్చరిక టైటిల్ తో ఇంకో సినిమా ఓకే చేశాడు కానీ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణంతో అది ఆగిపోయిన సంగతి తెలిసిందే.