తార‌క‌ర‌త్న పేరు నిలిచిపోయేలా బాల‌య్య‌…


నంద‌మూరి కుటుంబంలో నెల కింద‌ట పెద్ద విషాద‌మే చోటు చేసుకుంది. న‌టుడు తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురై.. మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివ‌రికి త‌నువు చాలించాడు. తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురైన‌పుడు ఆయ‌న బాబాయి బాల‌కృష్ణ త‌న వెంటే ఆసుప‌త్రికి చేరుకుని కొన్ని రోజుల పాటు త‌న అన్న కొడుకును కనిపెట్టుకుని ఉంటూ, చికిత్స‌ను ప‌ర్య‌వేక్షించడం ప్రశంస‌లు అందుకుంది.

తార‌క‌ర‌త్న మ‌ర‌ణించిన‌పుడు, అంత్య‌క్రియ‌లు, ఆ త‌ర్వాత జ‌రిగిన నివాళి కార్య‌క్ర‌మాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు. తార‌క‌ర‌త్న కుటుంబ బాధ్య‌త త‌నదే అని ఇప్ప‌టికే బాల‌య్య ప్ర‌క‌టించాడు కూడా. ఇప్పుడు తార‌క‌ర‌త్న పేరు నిలిచిపోయేలా.. ఒక గొప్ప ప‌నికి బాల‌య్య శ్రీకారం చుట్టిన‌ట్లు స‌మాచారం.

తాను హిందూపురంలో నిర్మించిన ఆసుప‌త్రిలో కోటి 30 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల ఖ‌ర్చుతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాడ‌ట బాల‌య్య‌. తార‌క‌ర‌త్న గుండెపోటుతో చ‌నిపోయిన నేప‌థ్యంలో అధునాత‌ గుండె శ‌స్త్ర‌చికిత్స‌ల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుంద‌ట‌. హిందూపురం వాసులు గుండె జ‌బ్బులు విష‌మించిన‌పుడు బెంగ‌ళూరుకో, హైద‌రాబాద్‌కో వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఇక్క‌డ స‌ర్జ‌రీలు చేయించుకునేలా అధునాత‌న టెక్నాల‌జీతో ఈ విభాగాన్ని తీర్చిదిద్ద‌నున్నార‌ట‌. ఈ విభాగానికి తార‌క‌ర‌త్న పేరునే పెడుతున్నాడ‌ట బాల‌య్య‌. ఇప్ప‌టికే ఈ విభాగానికి సంబంధించి శ‌స్త్ర‌చికిత్స ప‌రిక‌రాల‌ను కూడా తెప్పించాడ‌ట బాల‌య్య‌.

ఈ నంద‌మూరి హీరో చేసిన ప‌నిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇప్ప‌టికే బాల‌య్య హైద‌రాబాద్‌లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని విజ‌య‌వంతంగా న‌డిపిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే.