ఈ మధ్య కాలంలో ఇండియన్ వెబ్ సిరీస్ లోనూ విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ అవలంబిస్తున్న ధోరణి ఏకంగా వెంకటేష్ లాంటి పెద్ద స్టార్లను సైతం విమర్శలకు ఎదురుకునేలా చేస్తోంది. రానా నాయుడు విషయంలో ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయో చూస్తున్నాం. కానీ ఇంతకుముందు ప్రైమ్ లో వచ్చిన మీర్జాపూర్ లాంటి వాటిలో ఇంతకన్నా బూతులు, అడల్ట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ క్యాస్టింగ్ చిన్నది కావడంతో సగటు జనాలకు పెద్దగా తెలియలేదు. క్రమంగా ఈ ట్రెండ్ పట్ల సామాజిక కార్యకర్తలు, సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది
దీంతో ఓటిటి కంటెంట్ ని సెన్సార్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇన్ఫర్మేషన్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఈ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. కానీ నిజంగా అలా చేయడం సాధ్యమేనా అనే మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ చిత్తశుద్ధితో చేయాలనుకుంటే మాత్రం సులభమే. ఎందుకంటే చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో వెబ్ కంటెంట్, ఆన్ లైన్ మీద కఠిన నిబంధనలు, చట్టాలున్నాయి. అందుకే మనం చూసేవన్నీ వాళ్లకు అందుబాటులో ఉండవు. ట్రెండింగ్ లో ఆ కంట్రీస్ ని చూపించరు
కానీ ఇండియాలో అలాంటి కండీషన్లు లేవు కాబట్టి అన్నీ పాసవుతూ వచ్చాయి. వెబ్ సిరీస్ అంటే ఖచ్చితంగా బోల్డ్ కంటెంట్ ఉండే తీరాలన్న ఒక తరహా రూల్ లాంటిది పెట్టుకోవడం వల్లే విచ్చలవిడితనం ఓటిటిలో రాజ్యమేలుతోంది. ప్రాక్టికల్ గా వీటికి సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయడం, వందల కొద్ది వస్తున్న ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లకు కత్తెర వేయడం అంత సులభం కాదు. దీనికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలా అని వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ ఓటిటి కంపెనీలు ఊరికే ఉంటాయని అనుకోలేం. ఎంత లాబీయింగ్ కైనా సిద్ధపడతాయి.