కొర‌టాల‌కు మెసేజ్‌లు పెడుతున్న జాన్వి


ఆర్ఆర్ఆర్ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల సెట్స్ మీదికి వెళ్ల‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది. మ‌రి కొన్ని రోజుల్లోనే సినిమాకు ముహూర్త వేడుక జ‌రిపి.. ఆ వెంట‌నే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టేయాల‌నుకుంటున్నారు.

ఈ చిత్రంలో క‌థానాయిక‌గా బాలీవుడ్ భామ జాన్వి క‌పూర్ ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆమె లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. తార‌క్‌తో తాను న‌టించే అవ‌కాశాలున్న‌ట్లు ముందే సంకేతాలు ఇచ్చిన జాన్వి.. ఇప్పుడు ఈ విష‌యం అధికారికం అయిన నేప‌థ్యంలో జూనియ‌ర్‌తో జ‌ట్టు క‌ట్ట‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఎదురు చూస్తున్న‌ట్లు ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్ప‌టికే రెండుసార్లు చూశా. ఆయ‌న అందం, ఎన‌ర్జీ అసామాన్యం. తార‌క్‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే బాగుంటుంద‌ని గ‌తంలో చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పా. ప్ర‌తిరోజూ ఇదే విష‌యం దేవుడిని కోరుకునేదాన్ని. ఎట్ట‌కేల‌కు ఆ అవ‌కాశం వ‌చ్చింది. ఎన్టీఆర్ 30 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఆతృత‌గా ఉంది. సెట్లోకి అడుగు పెట్టేందుకు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ప్ర‌తి రోజూ మెసేజ్‌లు పెడుతున్నా అని జాన్వి చెప్పింది.

ధ‌డ‌క్ అనే సూప‌ర్ హిట్ మూవీతో బాలీవుడ్లో క‌థానాయిక‌గా అరంగేట్రం చేసిన జాన్వి.. ఆ త‌ర్వాత గుంజ‌న్ స‌క్సేనా, గుడ్ ల‌క్ జెర్రీ, మిలి చిత్రాల్లో న‌టించింది. ఆమె చివ‌రి మూడు చిత్రాలూ ఓటీటీలో నేరుగా విడుద‌లై మంచి స్పంద‌నే తెచ్చుకున్నాయి. ద‌క్షిణాదిన ఆమెకు తార‌క్‌తో చేయ‌బోయేదే తొలి చిత్రం.