వెంకీ సిరీస్‌పై విజయశాంతి పంచ్‌లు

Venkatesh In Rana Naidu Netflix Webseries
Venkatesh In Rana Naidu Netflix Webseries

సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చాక.. సినిమా వాళ్ల మీద విమర్శలు చేయాల్సి వచ్చినపుడు కొందరు సంయమనం పాటిస్తే.. కొందరేమో అలాంటి మొహమాటాలేమీ పెట్టుకోకుండా ఘాటు వ్యాఖ్యలు చేసేస్తుంటారు. రోజాతో పాటు విజయశాంతి ఈ కోవకే చెందుతారు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల మీద రోజా ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. విజయశాంతి కూడా గతంలో చిరు మీద ఘాటు వ్యాఖ్యలే చేసింది.

కొన్నేళ్ల ముందు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇదే విషయమై చిరంజీవి స్పందిస్తూ.. తాను రాజకీయాల్లో ఉండగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందినట్లు వెల్లడించారు. కానీ విజయశాంతి మాత్రం రాజకీయాల్లో ఇవన్నీ సహజం.. తేలిగ్గా తీసుకోవాలంటూ హితవు పలికారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు విజయశాంతి ఒకప్పటి తన మరో కోస్టార్ అయిన విక్టరీ వెంకటేష్ చేసిన వెబ్ సిరీస్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించింది.

వెంకీ నటించిన నెట్‌ఫ్లిక్స్ షో ‘రానా నాయుడు’లో అడల్ట్ కంటెంట్ మీద తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి షోలు వచ్చినపుడల్లా ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ ఉండాలనే చర్చ జరుగుతోంది. విజయశాంతి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘రానా నాయుడు’ పేరు పెట్టకుండా ఇటీవలే విడుదలైన ఒక తెలుగు టీవీ షో అని పేర్కొంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

ఓటీటీలకు సెన్సార్ ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ, ప్రత్యేకించి మహిళలు నివేదిస్తున్నారని.. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోని ఓటీటీల్లో అసభ్యతతో కూడిన కటెంట్‌ని తొలగించేలా చూడాలని.. ప్రజా, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోవద్దని విజయశాంతి హెచ్చరించారు. నటులకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానని.. భవిష్యత్తులో ఓటీటీ ప్రసారాలు ప్రజలు, మహిళా వ్యతిరేకతకు గురి కాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు.