అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించి అభిమానం సంపాదించుకున్నాడు. మెగా ఫోన్ పట్టి అతను తీసిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ కమర్షియల్ సక్సెస్ కావడమే కాక కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. రెండో చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ కూడా రెండు రకాలుగా మంచి ఫలితాన్నందుకుంది. దీంతో దర్శకుడిగా అవసరాల మూడో సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అతను ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు.
స్క్రిప్టు రాసి సినిమాను మొదలుపెట్టడంలోనే చాలా ఆలస్యం జరగ్గా.. ఆ తర్వాత కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయింది. ఐతే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు చూశాక.. లేటైతే అయ్యింది కానీ అవసరాల మరో క్లాసిక్‌తో రాబోతున్నాడనే అంచనాలు పెట్టుకున్నారు తన ఫ్యాన్స్.
కానీ తీరా బొమ్మ చూశాక అందరికీ దిమ్మదిరిగిపోయింది. కథ, పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటూ హాలీవుడ్ సినిమా ‘బిఫోర్ సన్‌రైజ్’ తరహా సినిమా తీద్దామని అవసరాల చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టేసింది. అసలు కథంటూ ఏమీ లేకుండా.. కథనంలో ఏ విశేషం లేకుండా.. తన మార్కు చమత్కారం.. డైలాగులు లేకుండా.. ఒక నిస్సారమైన సినిమా తీసిపెట్టాడు అవసరాల. అతను ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు తయారైంది సినిమా పరిస్థితి.
సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల్లో నిస్సారం ఆవహించి చివరి వరకు కూర్చోవడానికి కష్టపడాల్సి వచ్చింది. సినిమా అంతా చూసినా ఒక్క మెరుపు లేదు. అసలు సినిమా తీస్తున్నపుడు.. తర్వాత రష్ చూసుకున్నపుడు అవసరాల సహా ఎవ్వరికీ ఏ అనుమానం రాకపోవడం.. అందరూ గుడ్డిగా అవసరాలను నమ్మేసి అతను ఏం తీస్తే అది ఓకే చేసి ఫైనల్ కట్ వదిలేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సినిమా కోసమా అవసరాల ఏడేళ్లు టైం తీసుకున్నాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates