రమ్యతో షూట్.. కృష్ణవంశీ గుండె రాయి చేసుకుని


సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ.. చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ‘నక్షత్రం’ సినిమాతో గట్టి షాక్ తిన్న ఆయన.. ‘నట సామ్రాట్’ అనే మరాఠీ సినిమాను ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూలు చూసిన సినిమా ప్రముఖులు, మీడియా వాళ్లు ‘రంగమార్తాండ’ గురంచి గొప్పగా చెబుతున్నారు. ఇది చాలా హృద్యమైన, గుండెలు పిండేసే సినిమాగా చెబుతున్నారు. దీన్ని బట్టి సినిమాలో బరువైన సన్నివేశాలు చాలానే ఉంటాయని అర్థమవుతోంది.

తాజాగా ‘రంగమార్తాండ’ ప్రమోషన్లలో భాగంగా కృష్ణవంశీ చెప్పిన మాటలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సినిమా చివర్లో తన భార్య రమ్యకృష్ణ మీద తీసిన సన్నివేశాలు తీసేటపుడు చాలా బాధ పడ్డానని.. గుండె రాయి చేసుకుని ఆ సీన్లు తీశానని కృష్ణవంశీ చెప్పడం గమనార్హం.

“రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశా. రమ్యకు శక్తిమంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పగానే ఆమె ఈ పాత్ర ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే సెట్ చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకు వెళ్తుంది. ఈ సినిమా చివరి చాప్టర్లో తన మీద సన్నివేశాలు తీయడానికి చచ్చిపోయాను. దాదాపు 36 గంటల పాటు ఆ సన్నివేశాలు చిత్రీకరించాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. కానీ తప్పదు కదా. షూట్ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్ర కూడా పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా” అని చెబుతూ కృష్ణవంశీ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. కృష్ణవంశీ మాటల్ని బట్టి చూస్తే ఇది రమ్యకృష్ణ చనిపోయే సన్నివేశం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘రంగమార్తాండ’లో ప్రకాష్ రాజ్‌కు భార్యగా రమ్యకృష్ణ నటించింది.