డూప్లికేట్ తీయడానికి ఇన్ని కోట్లా?

ఒక బ్లాక్ బస్టర్ మూవీ రాగానే దాన్ని అనుకరిస్తూ సిినిమాలు తెరకెక్కడం మామూలే. ఐతే ఇలాంటి సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయి సినిమాలు తీయడం తప్పేమీ కాదు. ఈ తరహాలో హిట్టయిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీని చూసి యాజిటీజ్ అలాంటి సినిమానే తీయాలని చూస్తే బొక్క బోర్లా పడక తప్పదు.

కన్నడ సినిమా ‘కబ్జ’ ఈ కోవకే చెందుతుంది. ‘కబ్జా’ అని తెలుగులో టైటిల్ కూడా సరిగా రాయకుండా ‘కబ్జ’ అని పెట్టి వదిలేసిన ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులకు తల బొప్పి కడుతోంది. ‘కేజీఎఫ్’ సినిమాను పక్కన పెట్టుకుని స్క్రిప్టు రాసి.. ఆ సినిమా చూస్తే ఈ సినిమా తీసేశారేమో అనిపించేలా మొత్తం రెండున్నర గంటల సినిమాను ‘కేజీఎఫ్’ కాపీలాగా తీసేశాడు దర్శక నిర్మాత ఆర్.చంద్రు. ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైమాటే. ఇంత ఖర్చు పెట్టి తీసిందేమో ఒక డూప్లికేట్ సినిమా కావడమే విచారకరం.

ఉఫేంద్ర కన్నడలో టాప్ స్టార్, సీనియర్ హీరో. చాలా పెద్ద రేంజి ఉన్న ఉప్పి.. యశ్ అనే యంగ్ హీరో చేసిన ‘కేజీఎఫ్’ చూసి తమకూ అలాంటి సినిమా కావాలని ముచ్చట పడ్డారో లేక యశ్ చేసింది తానెందుకు చేయలేనో అనుకున్నాడో తెలియదు మరి. అచ్చంగా కేజీఎఫ్ తరహా ఎలివేషన్లతో.. ప్రతి విషయంలోనూ దాన్ని అనుకరిస్తూ ఈ సినిమా సాగింది. ఎక్కడా ఒరిజినాలిటీ లేదు. ఒక బలమైన ఎమోషన్ లేదు. సినిమా మొత్తంలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఒక్కటీ లేదు. సినిమాకు ఎంచుకున్న కలర్ థీమ్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. ఎడిటింగ్ ప్యాటర్న్.. ఇలా ప్రతి విషయంలోనూ ‘కేజీఎఫ్’ను ఇమిటేట్ చేస్తూ సాగిన సినిమాను చూస్తూ చివరి వరకు కూర్చోవడం చాలా కష్టమైపోతోంది ప్రేక్షకులకు.

తెలుగు ఆడియన్స్ తొలి రోజు ‘కబ్జ’ చూసి హాహాకారాలు పెట్టేశారు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ పెద్ద స్టార్లు కాబట్టి అక్కడి జనాలేమైనా ఈ సినిమాకు కొంచెం కనెక్ట్ అవుతారేమో చూడాలి. ఇతర భాషల్లో మాత్రం ‘కబ్జ’ పెద్ద డిజాస్టర్ అని మార్నింగ్ షోలకే తేలిపోయింది.