ఇళయరాజా పాటలను తెగ వాడేస్తున్నారు

ఒకప్పటి క్లాసిక్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి మళ్ళీ వాడుకోవడం కొత్తేమి కాదు. కాకపోతే వీటిని చేయించుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య ఇళయరాజా నిన్నటి తరం ఛార్ట్ బస్టర్స్ మీద దర్శకులు మనసు పారేసుకుంటున్నారు. ఇటీవలే కళ్యాణ్ రామ్ అమిగోస్ కోసం బాలకృష్ణ ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి కానీ పాటని రీ క్రియేట్ చేశారు గిబ్రాన్. సినిమా ఆడలేదు కాబట్టి జనానికి అంతగా రీచ్ కాలేదు కానీ బెస్ట్ రొమాంటిక్ ట్రాక్స్ లో దీని స్థానం చాలా ప్రత్యేకం. ఇప్పుడు ఇదే తరహాలో ఒకప్పటి మరో రాజాగారి ట్యూన్ ని రవితేజ కోసం తీసుకున్నారు.

Veyyinokka Song Promo | Ravanasura | Ravi Teja, Megha Akash | Harshavardhan Rameshwar |Sudheer Varma

వెంకటేష్ హీరోగా 1991లో రిలీజైన సూర్య ఐపీఎస్ కు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా మ్యూజికల్ గా ఆడియో చాలా బాగా సేల్ అయ్యింది. అందులో వచ్చే టీజింగ్ సాంగ్ వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే. కొత్తగా పోలీస్ అకాడెమిలో చేరిన విజయశాంతిని ఉడికిస్తూ హీరో పాడే గీతమిది. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గాత్రం అందించారు. మరో విశేషం ఏంటంటే సిరివెన్నెల సీతారామాశాస్త్రి గారు చాలా క్యాచీ పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు.

దీన్నే యధాతధంగా హర్షవర్ధన్ రామేశ్వర్ తో రీమిక్స్ చేయించారు దర్శకుడు సుధీర్ వర్మ. అనురాగ్ కులకర్ణి వాయిస్ లో ఫ్రెష్ ట్రాక్ సెట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లాగే ఇందులోనూ ఫిమేల్ గొంతు ఉండదు. కాకపోతే ప్రోమో చూస్తే ఆ స్థాయి మేజిక్ ఫీలింగ్ కలగడం లేదు. కొన్నేళ్ల క్రితం నాయక్ మూవీలో రామ్ చరణ్ ఇలాగే శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో అంటూ స్టెప్పులు వేయడం ఫ్యాన్స్ కి గుర్తే. ఇది కూడా రాజాగారిదే. రాబోయే రోజుల్లో 90 దశకంలో వచ్చిన అద్భుతమైన పాటలన్నీ ఇలా కొత్త సౌండ్ తో న్యూ జనరేషన్ ని పలకరించడం అలవాటుగా మారినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేడా కొట్టేస్తుంది.