గత రెండు దశాబ్దాల్లో టాలీవుడ్లో సినిమాల క్వాలిటీ, క్వాంటిటీ పరంగా చూస్తే నంబర్ వన్ అనదగ్గ నిర్మాత దిల్ రాజు. టాలీవుడ్ టాప్ స్టార్లు చాలామందితో సినిమాలు తీసిన రాజు అనేక ఘనవిజయాలను అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ సహా కొందరు అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఐతే ఎక్కువగా పెద్ద సినిమాలే తీసే రాజు.. ఈ మధ్య ‘బలగం’ అనే చిన్న సినిమాను ప్రొడ్యూస్ చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజు బేనర్లో చిన్న సినిమాలు లేవని కాదు కానీ.. ఇది వాటన్నింటికంటే చిన్న స్థాయి సినిమాలా కనిపించింది. ముందు ఈ సినిమా టైటిల్, పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూసి ఇదేదో తెలంగాణ నేటివిటీతో అవార్డుల కోసం తీసిన సినిమా అనుకున్నారు చాలామంది.
మామూలుగా తన సినిమాలను ప్రమోట్ చేసినట్లుగా ఈ చిత్రాన్ని రాజు ప్రమోట్ చేయలేదు. రిలీజ్ ముంగిట ఎక్కువ హంగామా చేయలేదు. దీంతో చాలామంది సినిమాను లైట్ తీసుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. మొదట్లో డల్‌గానే మొదలైనా.. మౌత్ టాక్ స్ప్రెడ్ అయి సినిమా అనూహ్యమైన ఆదరణ తెచ్చుకుంది. సెకండ్ వీకెండ్లో సినిమా పలు చోట్ల హౌస్ ఫుల్ అయింది.
తెలంగాణ మట్టి మనుషుల కథను చాలా హృద్యంగా.. గొప్పగా చూపించిన సినిమాగా దీనికి పేరొచ్చింది. దర్శక నిర్మాతల మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. భవిష్యత్తులో దీనికి పలు అవార్డులు కూడా రావచ్చేమో. పెట్టిన బడ్జెట్‌ను బట్టి చూస్తే కమర్షియల్‌గా కూడా సినిమా పెద్ద రేంజికి వెళ్తోంది. ఈ చిత్రానికి ఈ స్థాయిలో పేరు, డబ్బు వస్తాయని దిల్ రాజు కూడా ఊహించి ఉండడేమో.