ఆస్కార్ 95: ఈమె గురించి తెలుసుకోవాల్సిందే


‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిందన్న వార్త నిన్న ఉదయం నుంచి ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా రాజమౌళి తెచ్చుకున్న తిరుగులేని గుర్తింపు వల్ల.. భాషా భేదం లేకుండా ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐతే ఎప్పట్లా రాజమౌళి మీద ఏడ్చేవాళ్లు లేకపోలేదు. వాళ్లను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇండియాకు వచ్చాక ‘నాటు నాటు’ ఆస్కార్ సంబరాలు కొన్ని రోజుల పాటు కొనసాగుతాయనడంలో సందేహం లేదు.

ఐతే ఈ సంబరాలు ఓకే కానీ.. ఇదే సమయంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీ ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవడాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. గతంలోనూ ఇండియాలో తెరకెక్కిన డాక్యుమెంటరీలకు ఆస్కార్స్ వచ్చాయి. కానీ ఈసారి దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు కూడా మన వాళ్లే కావడం విశేషం.

ఈ డాక్యుమెంటరీ నిర్మాతల్లో ఒకరైన గునిత్ మోంగా గురించి భారతీయులు తెలుసుకోవడం.. సినీ రంగంలో ఆమె అద్భుత ప్రయాణాన్ని గుర్తించడం చాలా అవసరం. చూడ్డానికి చాలా సాధారణంగా కనిస్తుంది కానీ.. నిర్మాతగా ఆమె ఫిల్మోగ్రఫీ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. గతంలో ఆస్కార్ అవార్డు కోసం ఇండియా తరఫున నామినేట్ అయిన ‘లంచ్ బాక్స్’ లాంటి గొప్ప సినిమాకు గునీత్ నిర్మాత. అలాగే అనురాగ్ కశ్యప్ క్లాసిక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’లోనూ ఆమె సహ నిర్మాత. అలాగే అనేక అవార్డులు కొల్లగొట్టిన ‘మసాన్’లోనూ ఆమె భాగస్వామే.

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటైన ‘జల్లికట్టు’ వెనుక కూడా గునీత్ ఉన్నారు. ఇవన్నీ కాక దక్షిణాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సూర్య సినిమా ‘ఆకాశం నీ హద్దురా’లో కూడా గునీత్ నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఇంకా ఆస్కార్‌కు పోటీ పడ్డ మరో చిత్రం ‘విసారణై’కి కూడా గునీత్ సహ నిర్మాతగా వ్యవహరించింది. ఇలాంటి గొప్ప చిత్రాల్లో భాగస్వామిగా ఉన్న ఆమె.. ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకుంది.