కాజల్ ట్వీటుకు మెగా ఫ్యాన్స్ అలక

ఆ మధ్య పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ స్పీడ్ పెంచేందుకు పక్కా ప్లానింగ్ తో ఉంది. ఎప్పుడో కమిటైన కమల్ హాసన్ ఇండియన్ 2 ముందుగా పూర్తి చేసి త్వరలో బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎన్బికె 108లో పాల్గొనబోతోంది. ఈ సినిమాలో ఉన్నది లేనిది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ మొత్తానికి లాక్ అయినట్టు బలమైన సోర్స్ ఉంది. ఇదిలా ఉండగా మెగా ఫ్యాన్స్ కాజల్ మీద కినుక వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ట్విట్టర్ లో తమ సహ అభిమానులను బ్యాన్ చేయమని పిలుపునిస్తున్నారు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే నిన్న ఆస్కార్ వేడుక ముగిశాక పలు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ టీమ్ ని విష్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. అందులో కాజల్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ట్రోఫీ పట్టుకున్న పిక్ ని రీ ట్వీట్ చేస్తూ బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ మెసేజ్ పెట్టింది. మరో థ్రెడ్ లో టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతూ అందరినీ ట్యాగ్ చేసింది. అయితే అక్కడ ఎలాంటి ఫోటో లేదు. తన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ మగధీర ఇచ్చిన రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి బృందానికి ఇలాగేనా స్పందించడం అనేది మెగాభిమానుల కంప్లయింట్.

ఇక్కడ బయటికి కనిపించని కోణం ఒకటుంది. కాజల్ అగర్వాల్ ఆచార్యలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఒక పాట కొన్ని సీన్లు కూడా తీశారు. అయితే ఫైనల్ ఎడిటింగ్ లో క్యారెక్టర్ మొత్తం ఎగిరిపోయింది. ఉద్దేశం ఏదైనా కావాలనే ఇలా చేశారని కాజల్ ఫీలైనట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతల్లో ఒకడు. సో ఈ కారణమే కాజల్ ని ఇలా ప్రేరేపించి ఉండవచ్చు. లేదంటే ఆర్ఆర్ఆర్ గ్రూప్ మొత్తం ఉన్న ఫోటోని ట్వీట్ చేసి ఉండొచ్చు. కేవలం తన బాద్షా హీరోని మాత్రమే ఎందుకు హైలైట్ చేసిందనేది ఫ్యాన్స్ ప్రశ్న.