ఆ సీన్ చేయ‌డం వ‌ల్ల కొడుకు దూర‌మ‌య్యాడ‌ట‌

బేసిక్ ఇన్‌స్టింక్ట్.. ఎరోటిక్ ట‌చ్ ఉన్న హాలీవుడ్ థ్రిల్ల‌ర్ల‌లో ఈ సినిమాది ప్ర‌త్యేక‌మైన స్థానం. ష‌రాన్ స్టోన్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం 90వ ద‌శ‌కంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అప్ప‌ట్లోనే 300 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇందులో ష‌రాన్ స్టోన్ అప్పీయ‌రెన్స్.. ఆమె చేసిన ఎరోటిక్ సీన్లు యువ‌త‌కు అప్ప‌ట్లో పిచ్చెక్కించేశాయి. ష‌రాన్‌ను రాత్రికి రాత్రి పెద్ద స్టార్‌ను చేసిన ఈ చిత్రం వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ఆమెకు పెద్ద న‌ష్ట‌మే చేసింద‌ట‌.

ఈ సినిమాలో తాను చేసిన ఒక శృంగార స‌న్నివేశం కార‌ణంగా త‌న కొడుకు త‌న‌కు దూరం అయిన‌ట్లు తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో ష‌రాన్ వెల్ల‌డించింది. బేసిక్ ఇన్‌స్టింక్ట్ చేసిన ఎనిమిదేళ్ల త‌ర్వాత తాను త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న సంద‌ర్భంగా ఏం జ‌రిగిందో ఆమె వివ‌రించింది.

విడాకుల కేసు కోర్టుకు వ‌చ్చిన‌పుడు త‌మ కొడుకు ఎవ‌రి ద‌గ్గ‌ర ఉండాల‌నే విష‌య‌మై విచార‌ణ జ‌రిగింద‌ని.. ఆ సంద‌ర్భంగా నీ త‌ల్లి శృంగార సినిమాలు చేస్తుంద‌న్న విష‌యం నీకు తెలుసా అని జ‌డ్జి త‌న కొడుకును అడిగాడ‌ని.. తాను ఎలాంటి త‌ల్లినో త‌న కొడుక్కి చూపించే ప్ర‌శ్న అద‌ని.. కేవ‌లం ఆ ప్ర‌శ్న వ‌ల్లే త‌న కొడుకు త‌న‌కు దూరం అయ్యాడ‌ని.. ఇదంతా బేసిక్ ఇన్‌స్టింక్ట్‌లో తాను చేసిన శృంగార స‌న్నివేశం వ‌ల్లే అని ష‌రాన్ తెలిపింది.

నిజానికి ఆ స‌న్నివేశం త‌న‌కు తెలియ‌కుండా సినిమాలో పెట్టేశార‌ని.. తెర‌పై ఆ సీన్ అలా ఉంటుంద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని ష‌రాన్ వెల్ల‌డించింది. బేసిక్ ఇన్‌స్టింక్ట్ రిలీజ‌య్యాక త‌ర్వాతి ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో త‌న పేరును పిలిచిన‌పుడు అంద‌రూ వెట‌కారంగా న‌వ్వార‌ని.. అది త‌న‌కెంతో అవ‌మానంగా అనిపించి చాలా బాధ ప‌డ్డాన‌ని.. బేసిక్ ఇన్‌స్టింక్ట్ త‌న‌కు ఎంత ఫేమ్ తెచ్చిపెట్టిన‌ప్ప‌టికీ అది త‌న ఇమేజ్‌ను దెబ్బ తీసింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.