సమంతా టైటిల్ రోల్ పోషించిన శాకుంతలం విడుదలకు అట్టే సమయం లేదు. ఇంకో ముప్పై అయిదు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేస్తుంది. డేట్ దగ్గర పడే కొద్దీ నిర్మాత కం దర్శకుడు గుణశేఖర్ మీద ఒత్తిడి పెరుగుతోందని ఇన్ సైడ్ టాక్. సమర్పకులుగా దిల్ రాజు లాంటి పెద్ద చెయ్యి అండగా ఉన్నా చేయిదాటిపోయిన బడ్జెట్ వల్ల అంత మొత్తంలో వెనక్కు రావడం సవాల్ గా మారిందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. పైగా ట్రైలర్ కట్ ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మేకింగ్ మీద డివైడ్ కామెంట్స్ వచ్చాయి.
ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు నార్త్ నుంచి సౌత్ అందరికీ ఆ సినిమా డిస్కషన్ టాపిక్ కావాలి. కానీ అలాంటిదేమి కనిపించడం లేదు. బడ్జెట్ ఇప్పటిదాకా డెబ్భై కోట్ల దాకా అయ్యిందని, థియేట్రికల్ రైట్స్ కి మహా అయితే ముప్పై కోట్లకు మించి రాకపోవచ్చని అంటున్నారు. అదే జరిగిన పక్షంలో డిజిటల్, శాటిలైట్ నుంచే యాభై కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. ఎంత మల్టీ లాంగ్వేజ్ అయినప్పటికీ శాకుంతలంకు ఇతర భాషల్లో ఏమంత ఆసక్తి కనిపించడం లేదు. కథా నేపధ్యమే కొంత విషాదంతో కూడుకున్నది కావడమూ కారణమే.
పైగా ఏప్రిల్ 14న రుద్రుడు, బిచ్చగాడు 2 ఉండటం వల్ల తమిళనాడు ఓపెనింగ్స్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉంది. అక్కడి బయ్యర్లతో థియేటర్లు ఇప్పించుకోవడం పెద్ద సమస్య. పొన్నియన్ సెల్వన్ 1 టైంలో చిరంజీవి గాడ్ ఫాదర్ హ్యాండ్ ఇచ్చి తమిళ వెర్షన్ వాయిదా పడేలా చేశారు. శాకుంతలంకు ఆ పరిస్థితి రాకపోవచ్చు కానీ పోటీని ధీటుగా ఎదురుకోలేకపోతే అది వసూళ్లను ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ ఆలోచించి ఇదే రిలీజ్ డేట్ కి కట్టుబడతారా లేక ఇంకొంత ఆగుతారానేది చెప్పలేం కానీ శాకుంతలం గాథలో ఉన్న కష్టాలే సినిమాకూ వస్తున్నట్టున్నాయి.