షాకింగ్.. హీరోయిన్‌కి తండ్రి నుంచే లైంగిక వేధింపులు


‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది సెలబ్రెటీ లేడీస్ తమకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు. కొందరు ఈ ఉద్యమాన్ని వాడుకుని తప్పుడు ఆరోపణలు చేశారనే చర్చ కూడా జరిగినప్పటికీ.. మెజారిటీ మహిళలు తమకు జరిగిన అన్యాయాల గురించి ధైర్యంగా బయటికి చెప్పడం మంచి పరిణామం అనే చెప్పాలి. సినిమా హీరోయిన్లు ఎక్కువగా తమ ప్రొఫెషన్లో అవకాశాల పేరుతో తమను ఎలా వేధించారో చెప్పుకున్నారు.

ఐతే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్.. తన ఇంట్లో, అది కూడా తన తండ్రి ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టి డేరింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఖుష్బు.. ఇన్నేళ్ల తర్వాత తన చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

“చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిలైనా.,. అబ్బాయిలైనా జీవితాంతం బాధ పడుతూనే ఉంటారు. నా తల్లి భయంకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించింది. ఆమె భర్త.. భార్యను, పిల్లల్ని కొట్టడం.. తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం జన్మహక్కుగా భావించిన వ్యక్తి. అతను నాపై లైంగిక దాడి చేసేటప్పటికి నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఐతే అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నాకు 15 ఏళ్ల వయసులో వచ్చింది. మొదట్లో ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్మదేమో అని భయం ఉండేది. ఎందుకంటే ఆమె ఏం జరిగినా భర్త దేవుడు అనే మైండ్‌ సెట్‌తో ఉండేది. అందుకే నాకు ఎదురైన అనుభవం గురించి ముందు ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఒక వయసు వచ్చాక ఇదంతా తట్టుకోవడం కష్టమై అతడికి ఎదురు తిరగడం మొదలుపెట్టా. దాంతో అతను ఉన్నపళంగా మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో జీవనాధారం పోయి తర్వాతి రోజు తిండి దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో బతికాం. తర్వాత ధైర్యం కూడకట్టుకుని పరిస్థితులకు ఎదురుగా పోరాడటం నేర్చుకున్నా” అని ఖుష్బు తెలిపింది.