రాఖీభాయ్ మీద యువ దర్శకుడి సెటైర్లు

కెజిఎఫ్ సక్సెస్ గురించి, రిలీజైన టైంలో ఏకంగా ఆర్ఆర్ఆర్ ని మించి వసూళ్లు తెచ్చుకోవడం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా పరిమితంగా ఉండే శాండల్ వుడ్ మార్కెట్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బ్లాక్ బస్టర్ ఇది. దీని స్ఫూర్తితోనే కన్నడలో చాలా సినిమాలు హీరోల మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అలాంటి కెజిఎఫ్ లో రాఖీ భాయ్ క్యారెక్టరైజేషన్ గురించి బయట ఎక్కడ ఎవరూ నెగటివ్ గా మాట్లాడిన దాఖాలాలు పెద్దగా కనిపించవు. కానీ కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కొంత వివాదాస్పద కామెంట్లు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఈయనతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ, నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణలు ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందు ఇన్ డైరెక్ట్ గా రాఖీ భాయ్ పాత్ర గురించి ప్రస్తావించిన వెంకటేష్ మహా ఆ తర్వాత నేరుగా పాయింట్ లోకి వెళ్ళిపోయాడు. అమ్మ చెప్పిందని అంత బంగారం దోచేసిన హీరో తర్వాత దాన్ని ఎవరికి పంచకుండా నమ్ముకున్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు మాత్రమే ఇవ్వడం ఇదేం న్యాయమని కాస్త ఊగిపోతూనే ఉన్నారు. కెజిఎఫ్ లోపాలే లేని క్లీన్ మూవీ కాదు. కానీ 1200 వందల కోట్లు వసూళ్లు తెచ్చిన బ్లాక్ బస్టర్.

అంటే యునానిమస్ గా ఆడియన్స్ దాన్ని అంగీకరించినట్టే. అలాంటప్పుడు అదే పనిగా రాఖీ భాయ్ క్యారెక్టర్ గురించి ఎత్తి చూపడం వల్ల అది సోషల్ మీడియా లాంటి వేదికల్లో బూమరాంగ్ అయ్యే అవకాశమే ఎక్కువ. ట్విట్టర్ లో అదే జరుగుతోంది. వెంకటేష్ మహా ఇప్పటిదాకా చేసిందే ఒక స్ట్రెయిట్ మూవీ కేరాఫ్ కంచరపాలెం. గొప్పగా పేరు తెచ్చింది. రెండోది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సీన్ టు సీన్ రీమేక్ చేసిన మలయాళం సినిమా. ఇంకా కెరీర్ లో ఎదుగుతున్న టైంలో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లతో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ టేకింగ్ గురించి ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదేమో.