సత్తిగానితో మైత్రి డిజిటల్ స్నేహం

పెద్ద నిర్మాణ సంస్థలు కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కావాలని చూడటం లేదు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో అవకాశమున్న ప్రతి చోట తమ ప్రొడక్షన్ వెంచర్లు మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఒక విప్లవంగా దూసుకొచ్చిన ఓటిటి రంగంలో కూడా తమ జెండా పాతే ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కోట్ల పెట్టుబడులతో ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ బ్యానర్ దిశగా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అమిగోస్ పోయినా పెద్దగా నష్టపోలేదు.

తాజాగా మైత్రి డిజిటల్ లో అడుగు పెట్టింది. సత్తిగాని రెండెకరాలు పేరుతో రూపొందిన ఓటిటి మూవీని ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. పుష్పలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ఇందులో హీరో. బన్నీతో చేస్తున్న టైంలోనే సుకుమార్ రికమండేషన్ మీద తనకీ ఆఫర్ వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఏదో తక్కువ బడ్జెటని క్యాస్టింగ్ లో రాజీ పడలేదు. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహనశ్రీ లాంటి తారాగణం గట్టిగానే ఉంది. ఉన్న రెండెకరాల పొలం అమ్మాలా చావాలా అనే పాయింట్ మీద డార్క్ కామెడీతో రూపొందించారు.

ఇక్కడ బిజినెస్ కోణంలో చూడాల్సిన అంశం ఒకటుంది. సినిమాలా కాకుండా ఓటిటి మూవీలో రిస్క్ తక్కువగా ఉంటుంది. థియేటర్ల వ్యవహారాలు, విడుదల తేదీ తలనెప్పులు ఉండవు. ఒకేసారి వందల దేశాల్లో ప్రింట్ ఖర్చు లేకుండా నేరుగా ఆడియన్స్ కి స్ట్రీమింగ్ చేసేయొచ్చు. మంచి టాక్ వచ్చిందా వ్యూస్ మిలియన్లలో వర్షంలా కురుస్తాయి. యావరేజ్ అనిపించుకున్నా సరే ఓసారి చూద్దాంలే అనుకునే ప్రేక్షకులు కోట్లలో ఉంటారు. దీనివల్ల తీసినవాళ్లకు కొన్నవాళ్లకు ఇద్దరికీ లాభమే. సత్తిగాని రెండెకరాల తర్వాత మైత్రి యాక్టివ్ గా మరిన్ని డిజిటల్ సినిమాలు తీయించే పనిలో ఉందట.