టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడు హరీష్ శంకర్. తన తోటి దర్శకులంతా చకచకా సినిమాలు చేసుకుపోతుంటే.. అతను మాత్రం మూడున్నరేళ్లుగా మెగా ఫోన్ పట్టుకోలేదు. అలా అని అతడి చివరి సినిమా డిజాస్టర్ అయి తనకు అవకాశాలు లేకుండా చేయలేదు. 2019లో హరీష్ సినిమా ‘గద్దలకొండ గణేష్’ మంచి విజయమే సాధించింది. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు హరీష్.
ఐతే మూడేళ్ల కిందటే ఓకే అయిన ఈ సినిమా విషయంలో హరీష్‌తో పాటు పవన్ అభిమానులు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ… పవన్‌కున్న వేరే సినిమాలు, రాజకీయ కమిట్మెంట్ల పుణ్యమా అని ఈ సినిమా ఎంతకీ మొదలు కాలేదు. ముందు హరీష్ సొంత కథతో ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో తెరకెక్కాల్సిన సినిమా.. కొన్ని కారణాల వల్ల అటకెక్కేసింది. తర్వాత ఈ ప్రాజెక్టుకు ట్విస్ట్ ఇస్తూ.. తమిళ హిట్ ‘తెరి’కి రీమేక్‌గా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పేరుతో వేరే సినిమాను అనౌన్స్ చేశారు. కొన్ని నెలల కిందటే ఈ చిత్రానికి ప్రారంభోత్సవం జరిపారు. ఐతే ముహూర్త వేడుక ఘనంగా చేశారు కానీ.. ఈ సినిమా నిజంగా ఇప్పుడిప్పుడే సెట్స్ మీదికి వెళ్తుందనే నమ్మకాలు అభిమానుల్లో కనిపించలేదు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతోంది.
‘హరిహర వీరమల్లు’ షూట్‌కు బ్రేక్ ఇచ్చి ఇటీవలే ‘వినోదియ సిత్తం’ రీమేక్‌ను పట్టాలెక్కించిన పవన్.. మార్చిలో ‘ఉస్తాద్’ కోసం కూడా డేట్లు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ తొలి వారం నుంచి పది రోజుల పాటు ఈ సినిమా షూట్‌కు పవన్ హాజరవుతాడట. ఆ తర్వాత ‘వినోదియ సిత్తం’ రీమేక్‌ను పూర్తి చేసి ఈ చిత్రంలో నటిస్తాడట. సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమాకు కూడా వీలును బట్టి పవన్ డేట్లు కేటాయించనున్నట్లు సమాచారం. మొత్తానికి హరీష్ మూడున్నరేళ్ల నిరీక్షణకు తెరపడి త్వరలోనే పవన్‌తో సినిమా మొదలు పెడుతుండడం అతడికి గొప్ప ఊరటే.
Gulte Telugu Telugu Political and Movie News Updates