లైగర్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈపాటికి పూరి జగన్నాధ్ అదే విజయ్ దేవరకొండతో జనగణమనని సగానికి పైగానే పూర్తి చేసేవాడు. కానీ దాని డిజాస్టర్ ఫలితం ఏకంగా నెలల తరబడి కనిపించకుండా చేసింది. మీడియాకు దొరక్కుండా తన మానాన తాను ఏదో ముంబైలో ఉంటున్నప్పటికీ లైగర్ పెట్టుబడుల అంశం మీద ఫెమా అధికారుల విచారణను ఎదురుకోవాల్సి రావడం విచారకరం. సరే దానివల్ల భీకరమైన డ్యామేజ్ జరగలేదు కానీ పూరి నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ లా అంతకంత పెరుగుతోందే తప్ప ఎటూ తేలడం లేదు.
మొన్నామధ్య రెండు మూడు రోజులు చిరంజీవి లేదా బాలకృష్ణ ఒకరితో పూరి సినిమా చేయడం ఖాయమనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగానే తిరిగింది. కట్ చేస్తే అవేవీ నిజమయ్యే అవకాశం ఇప్పట్లో లేదని తేలిపోయింది, కొత్తగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గురించిన టాక్ చక్కర్లు కొడుతోంది. తనకు మంచి మాస్ ఇమేజ్ ఇచ్చిన దర్శకుడిగా పూరి మీద రామ్ కు నమ్మకం అభిమానం రెండూ ఉన్నాయి. అలా అని ముందు వెనుకా ఆలోచించకుండా ఇస్మార్ట్ కి ఎస్ చెప్పలేడు. ఎందుకంటే రెడ్ ఓ మోస్తరుగా ఆడి ది వారియర్ దెబ్బ కొట్టాక తన ఆశలన్నీ బోయపాటి శీను మీదే ఉన్నాయి.
అది చివరి దశకు వచ్చేలోగా తన నెక్స్ట్ మూవీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కానీ పూరికి ఎస్ చెప్పగలడా లేదా అనేది కథ మీద ఆధారపడి ఉంటుంది. పైగా దాని కొనసాగింపు పట్ల ప్రేక్షకుల్లో ఏ మేరకు ఆసక్తి ఉందో అనుమానమే. ఇస్మార్ట్ శంకర్ ఎంత కమర్షియల్ హిట్ అయినా అదేమీ కెజిఎఫ్, బాహుబలి లాగా రెండో భాగం కోసం విపరీతమైన డిమాండ్ తెచ్చుకున్నది కాదు. అలాంటప్పుడు దానికి కంటిన్యుయెషన్ అంటే తొందరపడకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇదీ ప్రచారమే తప్ప జరిగే సూచనలు అంత సులభంగా లేవు. ఒకవేళ నిజంగా చేతులు కలిపితే మాత్రం సంచలనమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates