పొన్నియన్ సెల్వన్-2 వాయిదా.. నిజమా?

తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టయిన చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. తమిళంలో ఆల్ టైం బెస్ట్ నవలగా పేరున్న ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళవాళ్లు ఉన్న ప్రతి చోటా ఈ చిత్రం అదరగొట్టింది.
తమిళులు ఈ చిత్రాన్ని గర్వకారణంగా భావించారు. ఈ సినిమా చూడడాన్ని ఒక బాధ్యతగా ఫీలయ్యారు. దీంతో సినిమాపై వసూళ్ల వర్షం కురిసింది. పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకే రెండో పార్ట్ కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘పీఎస్-2’ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. కానీ ఈ మధ్య అనుకున్న ప్రకారం ఈ సినిమా రావడం సందేహమే అని ప్రచారం మొదలైంది. ఈ ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా అన్నారు.

కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. అనుకున్న ప్రకారమే సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా వదిలింది. దీంతో తమిళ జనాల సంబరం మామూలుగా లేదు. మనకు అంత ఎగ్జైట్మెంట్ లేకపోయినా.. తమిళ జనాలు మాత్రం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి భాగం చూసిన ప్రతి ఒక్కరూ దీన్నీ చూస్తారనడంలో సందేహం లేదు.

థియేటర్లలో మిస్సయి ఓటీటీలో చూసిన వాళ్లు కూడా ముగింపు భాగాన్ని తెరపై చూడడానికి రెడీ అయ్యారు. టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనడంలో సందేహం లేదు. తెలుగులో అఖిల్ సినిమా ‘ఏజెంట్’కు పోటీగా ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ కాబోతోంది. హిందీలో కూడా ఈ సినిమా గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. మరి సెకండ్ పార్ట్ అయినా తమిళేతర భాషల్లో మంచి ఫలితం అందుకుంటుందేమో చూడాలి.