శ్రీలీలతో సితార సంస్థ సూపర్ దోస్తీ

ఒకే ప్రొడక్షన్ హౌస్ మాములుగా ఒకే హీరోతో వరసగా సినిమాలు చేయడం ఎప్పటి నుంచో ఉండేదే. నిర్మాతలు దేవీవరప్రసాద్ చిరంజీవితో, భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి బాలకృష్ణతో, శివప్రసాద్ రెడ్డి నాగార్జునతో ఇలా ఆయా బ్యానర్లలో అధిక శాతం వీళ్ళ చిత్రాలే ఉండేవి. ఇలాంటి అసోసియేషన్ హీరోయిన్ల విషయంలో చాలా తక్కువగా చూస్తుంటాం. అందులోనూ ఒక ఫ్లాప్ వస్తే చాలు మార్కెట్ లెక్కలు మారిపోతున్న తరుణంలో ఒక నోటెడ్ ప్రొడక్షన్ ఒకే అమ్మాయిని ఎక్కువ సినిమాల్లో లాక్ చేసుకోవడం నిజంగా విశేషమేనని చెప్పాలి. రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న శ్రీలీల ఇది చేసి చూపిస్తోంది.

సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ భామని ఇప్పటికి నలుగురు హీరోల పక్కన జోడిగా సెట్ చేసింది. మొదటిది మహేష్ బాబు 28. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. రెండోది నవీన్ పోలిశెట్టి హీరోగా రాబోయే అనగనగా ఒక రాజు. దీని చిత్రీకరణకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు కానీ సగానికి పైగానే పూర్తయ్యిందట. మూడోది పంజా వైష్ణవ్ తేజ్ తో ప్లాన్ చేసిన భారీ మూవీలోనూ శ్రీలీలే కథానాయిక. ఇది కూడా చిన్న బడ్జెట్ ది కాదు.

నాలుగోది విజయ్ దేవరకొండ కాంబోలో పట్టాలెక్కేందుకు రెడీగా ఉన్నది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ చేయబోతున్న ఈ పోలీస్ డ్రామాలో శ్రీలీలకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర డిజైన్ చేశారట గౌతమ్. ఇవి కాకుండా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్న మరో సినిమాకు సైతం సితార అధినేతలు ఆ అమ్మాయినే అడుగుతున్నారని తెలిసింది. ఈ లెక్కన కేవలం ఒక్క సంస్థ నుంచే శ్రీలీల అందుకోబోతున్న రెమ్యునరేషన్ కోట్లలో ఉండబోతోంది. ఇవి కాకుండా ఇతర నిర్మాణ సంస్థలవి కలుపుకుని తన చేతిలో పది దాకా సినిమాలున్నాయి. ఇంత బిజీగా సౌత్ లోనే ఏ హీరోయినూ లేదు.