మెగా బ్రదర్ నాగబాబు కొన్నేళ్ల కిందట పెద్ద సంక్షోభంలో చిక్కుకుని ఉన్నారు. ఆ సమయంలో సీరియల్స్ , టీవీ షోలు చేసి కొంచెం నిలదొక్కుకున్నారాయన. అప్పుడే కొడుకు వరుణ్ తేజ్ అందుబాటులోకి వచ్చాడు. హీరోగా తెరంగేట్రం చేసి చాలా త్వరగానే నిలదొక్కున్నాడు.
‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్-2’ లాంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకుంటూనే విజయాలు కూడా అందుకుని స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఇప్పుడు నాగబాబు కొడుకును చూసి ఎంత సంతృప్తిగా ఉంటాడో చెప్పాల్సిన పని లేదు.
ఆ మధ్య వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఎంత ఎమోషనల్ అయ్యాడో.. కొడుకు కెరీర్ పట్ల ఎంత గర్వ పడుతున్నట్లు చెప్పాడో తెలిసిందే. ఇప్పుడు కొడుకు కెరీర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడాడు.
వరుణ్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించడం పట్ల నాగబాగా చాలా సంతోషపడిపోయాడు. ఇక వరుణ్‌ను ఎలాంటి సినిమాల్లో చూడాలనుకుందని అడిగితే.. తన అన్నయ్య కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన రెండు సినిమాల్ని వరుణ్ రీమేక్ చేస్తే చూడాలనుందని నాగబాబు తెలిపాడు.
ఆ రెండు సినిమాలు.. ఛాలెంజ్, కొదమసింహం అని చెప్పాడు నాగబాబు. అన్నయ్య సినిమాల్లో ఈ రెండూ తనకెంతో ఇష్టమని.. వరుణ్‌ను హీరోగా పెట్టి వీటిని ఈ కాలానికి తగ్గట్లుగా రీమేక్ చేస్తే చూడాలనుందని నాగబాబు తెలిపాడు. ఐతే ఆ రెండు చిత్రాల్ని రీమేక్ చేయడం అంత సులువు కాదని కూడా నాగబాబు అభిప్రాయపడ్డాడు.
మరి వరుణ్ తండ్రి కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి గత ఏడాది ‘ఎఫ్-2’ లాంటి బ్లాక్ బస్టర్, ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ మూవీల్లో నటించిన వరుణ్.. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో కిరణ్ అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపథ్యంలో ఓ కొత్త సినిమా చేస్తున్నాడు. ఇది వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా..