ప్రభాస్ ‘స్పిరిట్’.. రా అండ్ పవర్ ఫుల్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు తేడా కొట్టినా.. ఇప్పుడు అతడి లైనప్ ఆసక్తికరంగానే ఉంది. ‘ఆదిపురుష్’ సంగతి పక్కన పెట్టేస్తే.. సలార్, ప్రాజెక్ట్-కేలపై భారీ అంచనాలే ఉన్నాయి. వీటితో పాటు మారుతి సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్ అయి చాలా కాలమే అయింది కానీ.. ప్రభాస్, సందీప్ కమిట్మెంట్ల వల్ల ఇది వెనక్కి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా అప్పట్లో సమాచారం బయటికి వచ్చింది. అంతకుమించి ఈ సినిమా నుంచి చాలా కాలంగా ఏ అప్‌డేట్ లేదు.

ఐతే ఏడాదిగా ‘యానిమల్’ సినిమాలో బిజీగా ఉన్న సందీప్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి స్పందించాడు. ‘‘ప్రభాస్‌తో రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే పవర్ ఫుల్ స్టోరీనే రాస్తున్నా. ఇది కచ్చితంగా ఒక రిఫ్రెషింగ్ మూవీ అవుతుంది. ప్రభాస్ నాతో చేసే సినిమా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో.. అంతకుమించి ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంటూ రెబల్ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ పెంచేశాడు సందీప్.

ప్రస్తుతం సందీప్ చేస్తున్న ‘యానిమల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది. రణబీర్ కపూర్‌ను ఇందులో తన స్టయిల్లో చాలా వయొలెంట్‌గా, పవర్ ఫుల్‌గా చూపించబోతున్నాడు సందీప్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ ఏడాదే పూర్తయ్యే అవకాశమున్న నేపథ్యంలో కొత్త ఏడాదిలో సందీప్ సినిమాను మొదలుపెట్టే అవకాశముంది.