తొలి సినిమా విడుదల ముంగిట దర్శకుడి మృతి

ఒక సినిమాకు సంబంధించి అన్నిటికంటే కష్టమైన విషయం, అతి పెద్ద బాధ్యత అంటే.. దర్శకత్వం వహించడమే. ఇది ఆషామాషీ విషయం అయితే కాదు. ఈ కల నెరవేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు ఎంతో కష్టపడుతుంటారు. సుదీర్ఘ కాలం ఎదురు చూస్తారు. అన్ని అడ్డంకులనూ అధిగమించి ఒక సినిమా తీసి.. అది రిలీజయ్యే క్షణం కోసం ఎంతో ఉత్కంఠగా, భావోద్వేగంతో ఎదురు చూస్తారు. కానీ ఇంకొన్ని రోజుల్లో ఆ మధుర క్షణాలు రాబోతుండగా.. తాను తీసిన సినిమాను వెండితెరపై చూసుకోకుండానే ప్రాణాలు వదలడం అంటే ఎంత దురదృష్టమో కదా? అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు మలయాళ పరిశ్రమకు చెందిన జోసెఫ్ మను జేమ్స్.

2004లో విడుదలైన ‘ఐయామ్ క్యూరియస్’ అనే సినిమాలో బాల నటుడిగా నటించి.. యుక్త వయసు వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు మలయాళ, హిందీ, కన్నడ సినిమాలకు పని చేసిన మను.. ‘నాన్సీ రాణి’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.

గత ఏడాదే ‘నాన్సీ రాణి’ సెట్స్ మీదికి వెళ్లింది. ఆ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. చాలామంది కొత్త నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. మరికొన్ని రోజుల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఇంతలో దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ హఠాత్తుగా కన్నుమూశాడు. అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మను ప్రాణాలు వదిలాడు. దీంతో మలయాళ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.

గత ఏడాది ‘అయ్యప్పనుం కోషీయుం’లో కీలక పాత్ర పోషించిన అనిల్ నెడుమంగడ్ ఒక నదిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు వదలగా.. అంతకుముందు ఆ చిత్ర దర్శకుడు సాచి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు మను లాంటి యువ దర్శకుడు చనిపోవడం ఇండస్ట్రీ జనాలను విషాదంలో ముంచెత్తింది.