ప్రాజెక్ట్‌-కే షూటింగ్ ఎంత అయింది?

ప్ర‌భాస్ కెరీర్లో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి భారీత‌నం, శ్ర‌మ‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమా అంటే ప్రాజెక్ట్‌-కేనే. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. అశ్వినీద‌త్ నిర్మాణంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని బ‌డ్జెట్ ఏకంగా రూ.500 కోట్లు కావ‌డం విశేషం.

ఆదిత్య 369 త‌ర‌హాలో సోషియో ఫాంట‌సీ ట‌చ్ ఉన్న సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా దీన్ని చెబుతున్నారు. హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

2024 జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌వుతుంద‌ని వెల్ల‌డించారు. ఐతే ప్ర‌భాస్ ఒకేసారి ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న నేప‌థ్యంలో ఇంత భారీ చిత్రం నిజంగా ఆ స‌మ‌యానికి పూర్త‌యి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అన్న సందేహాలున్నాయి.

కానీ ఈ విష‌యంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన ప‌ని లేద‌ని నిర్మాత అశ్వినీద‌త్ తేల్చేశాడు. సినిమా షూటింగ్ విష‌య‌మై ఆయ‌న కీల‌క‌మైన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు. ఇంకా విడుద‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇంకో 30 శాతం చిత్రీక‌ర‌ణ‌.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, ప్ర‌మోష‌న్‌కు బాగానే స‌మ‌యం ఉన్న‌ట్లే.

ఈ సినిమా వీఎఫెక్స్ ప‌నులు ప్ర‌సిద్ధి చెందిన ఐదారు స్టూడియోల్లో జ‌రుగుతున్నాయ‌ని.. ఆ ఎఫెక్ట్స్ తెర‌పై చూసిన‌పుడు న‌భూతో న‌భవిష్య‌తి అన్న‌ట్లుగా ఉంటాయ‌ని ద‌త్ చెప్పారు. ప్రేక్ష‌కులు ఇప్పటిదా చూడ‌ని స‌రికొత్త అనుభూతిని ప్రాజెక్ట్‌-కే చూస్త‌న్న‌పుడు పొందుతార‌ని ఆయ‌న‌న్నారు.

సినిమాలో ప్ర‌భాస్ త‌ర్వాత దీపిక‌, అమితాబ్‌ల‌కు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంద‌ని.. చాలా స‌న్నివేశాల్లో ఈ ముగ్గురి పాత్ర‌లు ఉంటాయ‌ని ద‌త్ తెలిపారు. త‌మ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్లో తెర‌కెక్కినా ఇందులో ఎమోష‌న్లు, సెంటిమెంట్ కూడా ఉంటాయ‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.