లేటు వయసులో రావుగారి హీరోయిజం

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా చెలామణి కావడం అరుదు. విలన్లు పెద్ద స్థాయికి వెళ్ళినవాళ్ళు చాలానే ఉన్నారు. మోహన్ బాబుతో మొదలుపెట్టి గోపిచంద్ దాకా స్టార్లుగా ఎదగడం చూస్తున్నాం. అయితే యాభై నాలుగేళ్ల వయసులో మొదటిసారి టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ రావడం చిన్న విషయం కాదు. రావు రమేష్ కి ఆ అవకాశం దక్కింది. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పేరుతో రూపొందబోయే కామెడీ ఎంటర్ టైనర్ లో హీరోగా నటించబోతున్నారు. ఇంద్రజ ఆయనకు జోడీగా కనిపిస్తారు. నీహారికతో హ్యాపీ వెడ్డింగ్ తీసిన లక్ష్మణ్ కార్య దీనికి దర్శకుడు.

వినడానికి బాగానే ఉంది కానీ సోలోగా రావు రమేష్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే ఔనని చెప్పలేం. ఎంత హాస్యపూరిత చిత్రమే అయినా రెగ్యులర్ గా సపోర్టింగ్ రోల్స్ లో చూసిన జనాలకు హఠాత్తుగా ఆయన్ని అంత పెద్ద పాత్రలో రెండు గంటల పాటు చూపించడం సవాలే. ఒకప్పుడు తండ్రి రావుగోపాలరావు గారు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కలియుగ రావణాసురుడు లాంటి చిత్రాలు చేశారు. అయితే అవన్నీ నెగటివ్ షేడ్స్ లో సాగేవి. కానీ ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మొదటి నుంచి చివరిదాకా నవ్విస్తూనే ఉంటాడట.

కెజిఎఫ్ చేశాక రావు రమేష్ కి ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. సినిమాకింత రెమ్యునరేషన్ నుంచి రోజుకింతని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. అసలే ఓటిటి జమానా. పబ్లిక్ ని టికెట్లు కొనేలా చేయడం పెద్ద హీరోలకే సవాల్ గా మారిపోయింది. అలాంటిది ఎంత గొప్ప నటుడైనా సరే ఇలా ఫిఫ్టీ ఏజ్ తర్వాత కథానాయకుడిగా మార్చడమంటే ఒకరకంగా సాహసమే. కమెడియన్ టు హీరోస్ గా సక్సెస్ అయినవాళ్లలో అలీ, బాబు మోహన్, సునీల్ లాంటి వాళ్ళు చాలానే ఉన్నారు కానీ రావు రమేష్ కు మాత్రం ఇదో రకంగా కొత్త సవాలే.