టీవీ సీరియల్ లా ఉందని తమిళ క్రిటిక్స్ విరుచుకుపడిన వారసుడు తెలుగులో ఓ మాదిరి వసూళ్లు సాధించిందే తప్ప బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆడలేదు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల పోటీని తట్టుకోవడం నిర్మాత దిల్ రాజు ఊహించినంత సులభంగా జరగలేదు. ఈ రెండు సినిమాల దెబ్బకే తెలుగు ఆడియన్స్ థియేటర్లలో విజయ్ మూవీని చూడలేకపోయారు. కట్ చేస్తే నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో వారసుడు స్ట్రీమింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో ప్రైమ్ చేసిన పబ్లిసిటీ బాగా రీచ్ అయ్యింది. దీంతో సహజంగానే చూసే ఆడియన్స్ భారీగా ఉన్నారు.
తీరా చూశాక నిజంగానే సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మరీ ఇంత రొటీన్ స్టోరీతో అంత పెద్ద హీరోని ఎలా ఒప్పించాడాని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రోల్ చేయడమే పనిగా సాగే బ్యాచులు ఏకంగా ఒరిజినల్ వీడియోలతో ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. ఓ రెండు ఫైట్లు రంజితమే పాట తప్ప మిగిలినదంతా మరీ రొటీన్ కంటెంట్ కావడంతో విమర్శలు ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీ కంటెంట్ బలంగా ఉంటుందనే నమ్మకంతో కుటుంబ ప్రేక్షకులు చూస్తే రెండు గంటల యాభై నిమిషాలు నిజంగానే వాళ్లకూ సోసోగానే అనిపించింది.
అసలు థియేటర్లలో ఆడిన బ్లాక్ బస్టర్లే ఓటిటిలో వచ్చాక జనాలకు అంతగా ఎక్కడం లేదు. జాతిరత్నాలుతో మొదలుపెడితే కాంతార దాకా ఇదే పరిస్థితి. అలాంటిది వారసుడు లాంటి వాటిని ఊరికే విడిచిపెడతారా. వీటి సంగతి ఎలా ఉన్నా మూడు వందల కోట్ల గ్రాస్ సాధించిన వరిసు దెబ్బకు విజయ్ తిరిగి వంశీ పైడిపల్లికే మరో ఆఫర్ ఇచ్చినట్టు ఆల్రెడీ చెన్నై టాక్ ఉంది. కథ కనక నచ్చితే లియో తర్వాత మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం ఈ స్టోరీ మీదే వంశీ సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టు సమాచారం. గ్రీన్ సిగ్నల్ వచ్చాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది.