త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పించుకున్న హీరో

త‌మిళంలో యాక్ష‌న్ సినిమాల‌కు పేరుప‌డ్డ హీరో విశాల్. తెలుగు వాడే అయినప్ప‌టికీ త‌మిళంలో హీరోగా మంచి స్థాయిని అందుకున్న విశాల్‌కు చాలా ఏళ్ల నుంచి స‌రైన హిట్ లేదు. అయినా స‌రే త‌న ఇమేజ్‌కు త‌గ్గ మాస్ మ‌సాలా సినిమాల‌తోనే అత‌ను సాగిపోతున్నాడు. త‌మిళం అనే కాక సౌత్ ఇండియాలో విప‌రీత‌మైన యాక్ష‌న్ డోస్‌తో సినిమాలు చేసే హీరోల్లో అత‌నొక‌డు. ఫైట్ల మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టే అత‌ను.. రియ‌ల్ స్టంట్స్ చేయ‌డానికి వెనుకాడ‌డు. ఈ క్ర‌మంలో దాదాపుగా ప్ర‌తి సినిమాలో గాయాల పాల‌వుతుంటాడు.

గ‌త ఏడాది వ‌చ్చిన సామాన్యుడు సినిమా కోసం స్టంట్స్ చేస్తుండ‌గా.. బీర్ బాటిల్ త‌ల‌పై, చేతిపై ప‌గిలి గాయాలు పాలవ‌డం.. ఆ వీడియోను విశాలే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. సినిమా కోసం మ‌రీ ఇలాంటి సాహ‌సాలు చేయాలా అని నెటిజ‌న్లు అన్నా.. విశాల్ ప‌ట్టించుకోలేదు.

ఇప్పపుడు మార్క్ ఆంటోనీ అనే త‌న కొత్త చిత్రం కోసం విశాల్ పెద్ద సాహ‌స‌మే చేశాడు. అత‌ను త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఒక యాక్ష‌న్ స‌న్నివేశం తీస్తుండ‌గా.. విశాల్ కింద ప‌డిపోగా.. ఒక భారీ వాహ‌నం అత‌డి మీదికి దూసుకొచ్చింది. చివ‌రి క్ష‌ణాల్లో దాన్ని చూసి త్రుటిలో త‌ప్పించుకున్నాడు విశాల్. సంబంధిత వీడియోను స్వ‌యంగా విశాలే ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశాడు. అది చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

యూనిట్లో విశాల్ స‌హా అంద‌రూ అంత నిర్ల‌క్ష్యంగా ఎలా ఉన్నారో అన్న సందేహం క‌లుగుతోంది. షూటింగ్ కోసం మ‌రీ ఇంత ప్ర‌మాద‌క‌ర విన్యాసాలు చేయాలా.. ఇలా ప్ర‌తి సినిమాకూ జ‌ర‌గ‌డం ఏంటి.. దీన్ని ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం ఏంటి అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. కొంద‌రేమో ప‌బ్లిసిటీ కోస‌మే ఇలా ప్లాన్ చేశారేమో అనే సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంగ‌త‌లా ఉంచితే.. విశాల్ కొంచెం స్టంట్ల మీద ఫోక‌స్ త‌గ్గించి క‌థ‌ల మీద దృష్టిపెట్టాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.