టాలీవుడ్ హీరోలే కాదు.. నిర్మాతలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని చూస్తున్నారు ఈ మధ్య. అందుకోసం ఓవైపు పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూనే ఇతర భాషల్లోకి వెళ్లి సినిమాలు నిర్మించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఈ ఏడాది ‘వారిసు’ చిత్రంతో దిల్ రాజు, ‘వాత్తి’ మూవీతో సితార నాగవంశీ కోలీవుడ్లో అడుగు పెట్టారు. వారికి మంచి ఫలితమే దక్కింది.
కానీ ఇండియాలో అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లో జయకేతనం వేయాలని చూస్తున్న టాలీవుడ్ నిర్మాతలకు మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి మన ప్రొడ్యూసర్లు నిర్మిస్తున్న చిత్రాలకు దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. వాళ్లు ప్రధానంగా రీమేక్ సినిమాలతోనే బాలీవుడ్లో హిట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అవి వర్కవుట్ కావట్లేదు.
దిల్ రాజుకు గత ఏడాది హిందీలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తెలుగు హిట్ ‘హిట్’ను రాజ్ కుమార్ రావు హీరోగా హిందీలో నిర్మించిన ప్రొడ్యూసర్లలో రాజు ఒకడు. అది కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. ఇక ‘జెర్సీ’ సినిమాను తెలుగు వెర్షన్ నిర్మాత నాగవంశీతో కలిసి హిందీలో పునర్నిర్మించాడు రాజు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాగే సంచలనం రేపుతుందనుకుంటే.. ఇది చతికిలపడింది.
ఇక గతంలో ‘గజిని’ సినిమాతో బాలీవుడ్లో భారీ విజయాన్నందుకున్న అల్లు అరవింద్.. తెలుగులో తన కొడుకు హీరోగా తెరకెక్కిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ను ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ఒరిజినల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్.రాధాకృష్ణ నిర్మాణ భాగస్వామే. కానీ వీళ్లిద్దరికీ చేదు అనుభవాన్ని మిగులుస్తూ ఈ రీమేక్ డిజాస్టర్‌గా నిలిచింది. మన నిర్మాతలు హిందీలో సినిమాలు చేయడం బాగానే ఉంది కానీ.. రీమేక్‌ల కంటే ఒరిజినల్ స్టోరీల మీద దృష్టిపెడితే మంచిదని ఈ చిత్రాల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.