ట్విట్టర్ బ్యాచులు టార్గెట్ చేశాయన్న కిరణ్

ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం ఒకింత సహనాన్ని కోల్పోయాడు. నిన్న సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్ లో ఒక ట్విట్టర్ బ్యాచ్ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని ఎవరెంత ట్రై చేసినా తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఎక్కడో మన భాషతో సంబంధం లేని వాళ్ళు పూణే నుంచి సినిమా ఎలా చూస్తారని అడుగుతూ, దాంతో పాటు నెగటివ్ టాక్ ప్రచారం చేయడం పట్ల విచారణ వ్యక్తం చేశాడు. మనకన్నా ముందే యుఎస్ ప్రీమియర్లు పడుతున్న ట్రెండ్ లో ఇలాంటి ప్రశ్న అడగటం సింక్ అవ్వలేదు కానీ కుర్రాడి మాటల్లో బాధ కనిపించింది.

కిరణ్ గత మూడు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా నేను మీకు బాగా కావాల్సినవాడిని చాలా డ్యామేజ్ చేసింది. ఆ గాయాన్ని వినరో భాగ్యము విష్ణుకథ మాన్పుతుందనే బలమైన నమ్మకాన్ని కిరణ్ ముందు నుంచి వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే కలెక్షన్లు మరీ భారీగా లేవు కానీ గత చిత్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న మాట వాస్తవమే. అయితే హఠాత్తుగా బ్లాక్ బస్టరని ఇప్పటికిప్పుడు చెప్పేంత స్థాయిలో దూకుడైతే లేదు. సార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో కిరణ్ మూవీకొచ్చిన డివైడ్ టాక్ ని పూర్తిగా తప్పనలేం.

సమ్మతమే కూడా నిర్మాతకు మంచి లాభాలు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా హిట్టని చెప్పే ప్రయత్నం చేశాడు కిరణ్. ఇవన్నీ ఎలా ఉన్నా ఏదో ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనే ట్రోల్స్ వస్తున్నాయని వాటి మీద పబ్లిక్ స్టేజి మీద ఇంతగా స్పందించడం అప్ కమింగ్ హీరోలకు లేనిపోని తలనెప్పులు తెచ్చేదే. వద్దన్న రచ్చని ఎక్కువ చేయడంలో సోషల్ మీడియా జనాలు ముందుంటారు. ఆ మధ్య మంచు విష్ణు ఎంతగా ఇబ్బంది పడ్డాడో చూశాం. సైలెంట్ గా ఉంటేనే ఇలాంటివి ఆగుతాయి తప్పించి రెస్పాన్స్ ఇచ్చేకొద్దీ ఎక్కువవుతాయి కానీ తగ్గవు.